అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చంపేందుకు ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు యత్నించిందని రష్యా ఆరోపించింది. పుతిన్‌ను లక్ష్యంగా చేసుకుని రష్యా అధ్యక్ష భవనం(క్రెమ్లిన్)పై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేసిందని పేర్కొంది. మొత్తం రెండు డ్రోన్లను ఇందుకు వినియోగించిందని రష్యా వార్తా సంస్థలు వివరించాయి. ఆ రెండు డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థ కూల్చివేసిందని పేర్కొన్నాయి. పుతిన్‌కు గానీ, భవనానికి గానీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రష్యా తెలిపింది. క్రెమ్లిన్ ఆ ప్రకటన చేయడానికి కొంత సమయం ముందే మాస్కోలో ఎవరూ డ్రోన్లు వినియోగించరాదని రష్యా ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్ చర్యను ప్రణాళికా బద్ధమైన ఉగ్రచర్యగా పరిగణిస్తామని క్రెమ్లిన్ తెలిపింది.
ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి రాత్రికి రాత్రే రష్యాకు చెందిన ఓ టెలిగ్రామ్ ఛానల్లో ప్రసారమైంది. క్రెమ్లిన్‌పై పొగలు రావడం ఆ వీడియోలో కనిపిస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం.. దాదాపు రాత్రి 2.30 గంటల ప్రాంతంలో శబ్దాలు వినిపించి.. పొగలు కనిపించాయని క్రెమ్లిన్ పక్కన అపార్ట్మెంట్లలో నివాసం ఉండేవారు వెల్లడించారు.
అధ్యక్ష భవనంపై ఎగురుతున్న డ్రోన్ అటు రష్యాలో ఉక్రెయిన్ మరో డ్రోన్ దాడి చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ దాడిలో క్రస్నొడార్ రీజియన్‌లోని ఓ ఆయిల్ డిపో దెబ్బతిన్నట్లు పేర్కొంది. క్రస్నొడార్ రష్యా ఆక్రమిత క్రిమియాకు చేరువలో ఉంది. దాడికి ముందు భయంకర శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక దళాలు ఘటనను అదుపులోకి తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
డ్రోన్‌ను పేల్చేసిన దృశ్యాలు అయితే, దాడిపై రష్యా ఆరోపణలను ఉక్రెయిన్ ఖండిచింది. డ్రోన్ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని వివరించింది. ఇలాంటి దాడులతో సైనిక సమస్యలు పరిష్కారం కాదని తెలిపింది. ఇలా చేస్తే ఉక్రెయిన్ నగరాలపై, పౌర జనాభాపై, మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు చేసుకునేందుకు అవకాశాన్ని ఇస్తుందని తెలిపింది. ఇలాంటి పనులు తాము ఎందుకు చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్ష సలహాదారు మైఖైలో పోడోల్యాక్ అన్నారు.
అయితే రష్యా తన వాదనలకు ఎలాంటి ఆధారాలు చూపించలేదు. మంగళవారం రష్యా తమ దేశ వార్షిక విజయోత్సవ జరుపుకోవడానికి సిద్ధమవుతున్న వేళ.. ఇలాంటి హత్యాయత్న ఆరోపణలు రావడం గమనార్హం. మే 9వ తేదీన రష్యా విక్టరీ డే సందర్భంగా అధ్యక్షుడు హత్యకు.. టెర్రరిస్టులు కుట్రపన్నినట్లు తాము భావిస్తున్నామని క్రెమ్లిల్ ప్రకటించింది. వేడుకల్లో భాగంగా నిర్వహించే పరేడ్‌కు విదేశీ ప్రముఖులు హాజరవుతున్న వేళ.. వాటికి ఆటకం కలిగించే చర్యలుగా దీన్ని పరిగణిస్తున్నామని వెల్లడించింది.
ఘటన జరిగిన సమయంలో పుతిన్ అధ్యక్ష భవనంలో లేరని.. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ప్రస్తుతం పుతిన్ సురక్షితంగా ఉన్నారన్న ఆయన.. ఘటన అనంతరం ఆయన షెడ్యూల్ మార్చినట్లు వెల్లడించారు. దాడి గురించి వార్తలు వెలువడడానికి కొద్దిసేపటి ముందే మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్.. రాజధానిలో ఎవ్వరు డ్రోన్‌లను వినియోగించరాదని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు తప్ప మరెవ్వరు వీటిని వాడరాదని వెల్లడించారు. కానీ అందుకు గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.