రష్యాతో ఎడతెగని పోరాటంలో ఉక్రెయిన్ సర్వం కోల్పోతోంది. రష్యా ధాష్టీకంలో సైన్యంతోపాటు సామాన్యులూ ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 262 మంది క్రీడాకారులు కూడా ఉన్నట్లు ఆ ఉక్రెయిన్ క్రీడాశాఖ వెల్లడించింది. 363 క్రీడాప్రాంగణాలు ధ్వంసమైనట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌తో పాటు ఏ పోటీల్లోనూ రష్యా క్రీడాకారులను అనుమతించకూడదని ఉక్రెయిన్ క్రీడాశాఖ మంత్రి వదిం హట్‌సెయిట్ డిమాండ్ చేశారు.
అంతర్జాతీయ పోటీల్లో తటస్థ అభ్యర్థులుగా రష్యాతో పాటు బెలారస్ క్రీడాకారులు పాల్గొనవచ్చంటూ ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ నిర్ణయించింది. 2024 పారిస్‌లో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనే అంశంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. దీన్ని ఉక్రెయిన్ తీవ్రంగా వ్యతిరేకించింది. 2024 క్రీడలకు జరిగే క్వాలిఫయింగ్ ఈవెంట్లలో రష్యాతో ఉక్రెయిన్ తలపడాల్సి వస్తే తమను క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు అనుమతించవద్దని కోరింది.
ఏడాదిగా రష్యా కొనసాగిస్తున్న దురాక్రమణతో ఇరువైపుల భారీ ప్రాణనష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్‌లో ఏకంగా కొన్ని నగరాలే నామరూపాలు లేకుండా పోగా.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రష్యా సైనికుల ఆకృత్యాలకు వేల మంది బలైపోయారు. మహిళలను అత్యాచారం చేస్తున్నారు. దీంతో తమ మాతృభూమిని రక్షించుకునేందుకు పౌరులు ఆయుధాలను చేతపట్టి కదన రంగంలో పోరాడున్నారు. ఈ క్రమంలో దిమిత్రి షార్పర్ అనే స్కేటర్, డెకథ్లాన్ ఛాంపియన్ వొలోదిమిర్ ఆండ్రోష్‌చక్‌తో పాటు ఎంతో మంది అంతర్జాతీయ ఉక్రెయిన్ క్రీడాకారులు ప్రాణాలు కోల్పోయారు.
రష్యాలో మిలిటరీ బ్లాగర్ మృతి..
రష్యా సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలోని ఓ కేఫ్‌లో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ప్రముఖ మిలిటరీ బ్లాగర్ వ్లాడ్లెన్ టాటార్స్కీ చనిపోయినట్లు సమాచారం. సుమారు 15 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఇక్కడి 'స్ట్రీట్ బార్' కేఫ్‌లో పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. కేఫ్‌లోకి వచ్చినవారిలో ఒక వ్యక్తి పేలుడు పదార్థాన్ని లోపలకి తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అయితే, ఈ ఘటనకు తమదే బాధ్యతని ఎవరూ ప్రకటించుకోలేదు.
వ్లాడ్లెన్ టాటార్స్కీ.. స్ట్రీట్ బార్ కేఫ్‌లో కొందరితో సమావేశమయ్యారని.. ఆ సమయంలో ఒక మహిళ ఆయనకు ఓ విగ్రహం బహూకరించిందని.. అనంతరం అది పేలిపోయిందని రష్యా మీడియాలో కథనాలు వచ్చాయి. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యాలో అనేక పేలుళ్లు సంభవించాయి. అయితే, ఈ ఘటనలకు ఉక్రెయిన్‌తో పోరుకు సంబంధం ఉందా? అన్న విషయంపై స్పష్టత లేదు.