UK Visa Rule Changes 2023 :దేశంలో విపరీతంగా పెరుగుతున్న వలసలను అడ్డుకునేందుకు ఉపాధి వీసాను మరింత కఠినతరం చేయాలని బ్రిటన్‌లోని రిషి సునాక్ సర్కారు నిర్ణయించింది. ఇక నుంచి అత్యధిక వేతనాలున్న విదేశీ వృత్తి నిపుణులకే వీసాలివ్వాలని, డిపెండెంట్లుగా వచ్చే భాగస్వాములకు కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్రిటన్ హోంశాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ సోమవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో పని చేయడానికి వెళ్లిన వృత్తి నిపుణులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్ తీసుకురాలేరు. కఠిన నిబంధనల వల్ల ప్రస్తుత వలసల్లో 3లక్షల మంది వరకు తగ్గుతారని మంత్రి క్లెవర్లీ చెప్పారు.
బ్రిటన్‌లో వృత్తి నిపుణుల వీసా పొందడానికి గతంలో ఏడాదికి 26,200 పౌండ్ల వేతనం ఉంటే సరిపోయేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఆ వేతనం 38,700 పౌండ్లు ఉండాలని నిర్ణయించింది. గతంలో కుటుంబ వీసా కోసం 18,600 పౌండ్ల వేతనం ఉంటే సరిపోయేది. దానినీ 38,700 పౌండ్లకు ప్రభుత్వం పెంచింది. భవిష్యత్తులో విద్యార్థి వీసాలపైనా ఆంక్షలను అమలు చేయనున్నట్లు మంత్రి క్లెవర్లీ ప్రకటించారు. రికార్డ్ స్థాయిలో వలసలు వచ్చినట్లు బ్రిటన్ జాతీయ గణాంక కార్యాలయం నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. సుమారు 6,72,000 మంది బ్రిటన్‌కు రాగా, వీరిలో అత్యధికులు భారతీయులే ఉన్నట్లు చెప్పింది.