బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ అధికారం చేపట్టిన కొన్ని రోజులకే యూటర్న్ తీసుకున్నారు. సంపన్నులకు ఆదాయపు పన్ను కోత విధించాలన్న నిర్ణయంపై వెనక్కి తగ్గారు. సంపన్నులకు పన్నుల్లో రాయితీ కల్పిస్తామని ప్రధాని పీఠం కోసం జరిగిన ఎన్నికల్లో ప్రచారం చేస్తూ వచ్చిన ఆమె.. అందుకు అనుగుణంగా 10 రోజుల క్రితం ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌లో దానికి సంబంధించిన ప్రకటన చేశారు. అయితే, మార్కెట్ ఒడుదొడుకులు, అధికార కన్జర్వేటివ్ పార్టీలో వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.
రిషి సునాక్‌పై విజయం సాధించి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లిజ్ ట్రస్ ప్రభుత్వం 10 రోజుల క్రితం మినీ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది. అందులో అధికాదాయం కలిగిన సంపన్నులకు ఆదాయపు పన్నులో 45 శాతం మేర కోత విధిస్తామని ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని ఛాన్సలర్ క్వాసీ క్వార్టెంగ్ బడ్జెట్ సందర్భంగా ప్రకటించారు. అయితే, మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో డాలర్‌తో పోలిస్తే బ్రిటన్ పౌండ్ విలువ భారీగా పతనమైంది. దీంతో ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ రంగంలోకి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో పన్ను కోత ప్రణాళికను ప్రకటించడం పట్ల ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి.
సొంత పార్టీ నేతల నుంచీ వ్యతిరేకత రావడంతో పన్ను కోత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఛాన్సలర్ క్వాసీ క్వార్టెంట్ కీలక ప్రకటన చేశారు. ప్రజల అభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. దేశ వృద్ధి గురించే ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకున్న సందర్భాలున్నాయంటూ తమ నిర్ణయాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా గడిచిన 12 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చూశానని ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రధాని లిజ్ ట్రస్ సైతం ట్వీట్ చేశారు. బ్రిటన్‌ను ముందుకు తీసుకెళ్లాలన్న తమ నిర్ణయానికి పన్ను కోత అంశం అడ్డంకిగా మారిందని పేర్కొన్నారు. వృద్ధికి చర్యలు తీసుకుంటూ.. దేశంలో ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. అయితే, పన్ను కోత నిర్ణయానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ ఆదివారం బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న మరుసటి రోజే లిజ్ ట్రస్ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం. అంతేకాదు.. బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌తో తనను పోల్చుకునే లిజ్ ట్రస్‌కు రాజకీయంగా ఈ నిర్ణయం మచ్చలాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. 'వెనక్కి తిరిగి చూసే నైజం' కాదని చెప్పుకొనే థాచర్‌ను అనుసరించే వ్యక్తి.. ఇలా అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే యూటర్న్ తీసుకోవడం ఇందుక్కారణం.