Boris Johnson resigns: వరుస వివాదాలకు కేంద్రబిందువై సొంత పార్టీ సభ్యుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. చివరకు ఒత్తిళ్లకు తలొగ్గారు. అందరూ డిమాండ్ చేస్తున్నట్లుగా.. ప్రధాన మంత్రి పదవి నుంచి వైదొలిగేందుకు అంగీకరించారు. ఈ విషయంపై గురువారం ఆయన అధికారిక ప్రకటన చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పదవిని వీడడం చాలా బాధగా ఉందని అన్నారు. కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే వరకు తాను పదవిలో కొనసాగుతానని, కొత్త ప్రధానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు బోరిస్.
బోరిస్ జాన్సన్ కొంతకాలంగా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. కొవిడ్ కాలంలో అధికారిక నివాసంలో పార్టీలు నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇదే విషయంపై ఇప్పటికే పలుమార్లు దేశ ప్రజలకు, పార్లమెంటుకు క్షమాపణలు చెప్పిన బోరిస్ జాన్సన్ గత నెలలో అవిశ్వాస పరీక్ష నుంచి త్రుటిలో బయటపడ్డారు. స్వపక్ష అధికార కన్జర్వేటివ్ ఎంపీలు కొందరు ఆయనకు వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ పదవీ గండం నుంచి గట్టెక్కారు. ఇంతలోనే ప్రభుత్వ మాజీ డిప్యూటీ చీఫ్ విప్ క్రిస్ పించర్ వివాదంలో జాన్సన్ కూరుకుపోయారు. పించర్ నడవడిక గురించి తెలిసినా ప్రాధాన్యం గల ప్రభుత్వ పదవిలో నియమించారన్నది ప్రధాన ఆరోపణ. పార్టీ గేట్ వ్యవహారంలోనూ తొలుత తనకేమీ తెలియదని, ఆ తర్వాత క్షమాపణలు చెప్పినట్లుగానే క్రిస్ పించర్ వివాదంలోనూ జరిగింది. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి నిజాయతీని కేబినెట్‌లోని మంత్రులే శంకించాల్సి వచ్చింది. అయితే.. తాను వెనక్కు తగ్గబోనని బోరిస్ స్పష్టం చేశారు. ఒకవైపున ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం, ఇంకో వైపున రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దేశం పెనుసవాళ్లను ఎదుర్కొంటోందని, ఇటువంటి తరుణంలో ప్రజలు అప్పగించిన బాధ్యతల నుంచి పారిపోయేది లేదని తేల్చి చెప్పారు.