తెలంగాణ

telangana

ETV Bharat / international

ముదిరిన సంక్షోభం.. మరో 15 మంది మంత్రుల రాజీనామా.. బోరిస్​ను తప్పించలేరా? - పార్టీ గేట్ బోరిస్ జాన్సన్

Britain political crisis: బ్రిటన్​లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. మంగళవారం ఇద్దరు కేబినేట్ మంత్రులు రాజీనామా చేయగా, బుధవారం మరో 15 మంది వారితో జత కలిశారు. ప్రధాని పదవి నుంచి వైదొలగాలన్న మంత్రులు, స్వపక్ష, విపక్ష ఎంపీల డిమాండ్‌ను ప్రధాని బోరిస్ జాన్సన్​ తోసిపుచ్చారు. బుధవారం ప్రతినిధుల సభలో జరిగిన ప్రశ్నావళి కార్యక్రమంలో ప్రధాని పదవిని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

britain political crisis
బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

By

Published : Jul 7, 2022, 7:19 AM IST

Britain political crisis: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో పడింది. ఆయన నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన మంత్రుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఆ పదవి నుంచి జాన్సన్‌ వైదొలగాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఇద్దరు కేబినెట్‌ మంత్రులు రాజీనామా చేయగా బుధవారం మరో 15 మంది మంత్రులు వారితో జత కలిశారు. దౌత్యాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వరుస పెట్టి రాజీనామాలు చేస్తున్నారు. బుధవారం నాటికి ప్రభుత్వాన్ని వీడిన వారందరి సంఖ్య 37కి చేరింది.

.

అయితే, విపక్షంతో పాటు స్వపక్షం నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నా ప్రధాన మంత్రి పదవిని వదిలేది లేదని బోరిస్‌ జాన్సన్‌ స్పష్టం చేశారు. ఒకవైపున ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం, ఇంకో వైపున రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దేశం పెనుసవాళ్లను ఎదుర్కొంటోందని, ఇటువంటి తరుణంలో ప్రజలు అప్పగించిన బాధ్యతల నుంచి పారిపోయేది లేదని తేల్చి చెప్పారు. ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌, ఆర్థికశాఖ మంత్రి రిషి సునాక్‌ మంగళవారం నిమిషాల వ్యవధిలో తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బుధవారం కూడా ఆ పరంపర కొనసాగింది.

దుష్ప్రవర్తన ఆరోపణలున్న క్రిస్‌ పించర్‌ వ్యవహారం తెలిసినా కీలక పదవిలో నియమించడంతో తీవ్ర వివాదంలో చిక్కుకున్న ప్రధాని బోరిస్‌ జాన్సన్‌...బుధవారం పార్లమెంటులోని ప్రతినిధుల సభలో జరిగిన ప్రశ్నావళి కార్యక్రమంలో మాట్లాడారు. ప్రధాని పదవి నుంచి వైదొలగాలన్న మంత్రులు, స్వపక్ష, విపక్ష ఎంపీల డిమాండ్‌ను తోసిపుచ్చారు. దేశ, అంతర్జాతీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రస్తుత సంక్లిష్ట స్థితిలో దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు.

ప్రధానిని తప్పించలేరా?
కొవిడ్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార నివాసంలో విందుల్లో (పార్టీ గేట్‌)పాల్గొని ఇప్పటికే పలుమార్లు దేశ ప్రజలకు, పార్లమెంటుకు క్షమాపణలు చెప్పిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గత నెలలో అవిశ్వాస పరీక్ష నుంచి త్రుటిలో బయటపడ్డారు. స్వపక్ష అధికార కన్జర్వేటివ్‌ ఎంపీలు కొందరు ఆయనకు వ్యతిరేకంగా ఓటేసినప్పటికీ పదవీ గండం నుంచి గట్టెక్కారు. ఇంతలోనే ప్రభుత్వ మాజీ డిప్యూటీ చీఫ్‌ విప్‌ క్రిస్‌ పించర్‌ వివాదంలో జాన్సన్‌ కూరుకుపోయారు. పించర్‌ నడవడిక గురించి తెలిసినా ప్రాధాన్యం గల ప్రభుత్వ పదవిలో నియమించారన్నది ప్రధాన ఆరోపణ. పార్టీ గేట్‌ వ్యవహారంలోనూ తొలుత తనకేమీ తెలియదని, ఆ తర్వాత క్షమాపణలు చెప్పినట్లుగానే క్రిస్‌ పించర్‌ వివాదంలోనూ జరిగింది. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి నిజాయతీని కేబినెట్‌లోని మంత్రులే శంకించాల్సి వచ్చింది. దీంతో రాజీనామాల పరంపర మొదలైంది.

ఈ పరిస్థితుల్లో ప్రధాని పదవిలో జాన్సన్‌ కొనసాగడం సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం ప్రతినిధుల సభలో జరిగిన ప్రశ్నావళి కార్యక్రమంలో ప్రధాని పదవిని వీడేది లేదని ఆయన స్పష్టం చేశారు. గత నెలలోనే అవిశ్వాస తీర్మానం పెట్టినందున మరో ఏడాది వరకు జాన్సన్‌ ప్రభుత్వంపై ఆ ప్రయత్నం చేసేందుకు నిబంధనలు అనుమతించవని నిపుణులు అంటున్నారు. అయితే, ఈ నిబంధనకు సవరణలు చేస్తే మళ్లీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం సాధ్యమేనని, దీనికి సంబంధించిన '1922 కమిటీ' కార్యనిర్వాహకులు తలుచుకుంటే ఆ పని చేయవచ్చనే అభిప్రాయం ఉంది.

గత నెలలో మూడు పార్లమెంటరీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్‌ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయారు. జాన్సన్‌ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారనడానికి ఇదే నిదర్శనమని విపక్ష లేబర్‌ పార్టీ నేత కీర్‌ స్టార్మర్‌ విమర్శలు సంధించారు. మునిగిపోతున్న ఓడ నుంచి ఎలుకలు పరారైనట్లుగా మంత్రులు రాజీనామాలు చేస్తున్నారని తాజా పరిణామాలపై వ్యాఖ్యానిస్తున్నారు.

ఇదీ చదవండి:జైలుపై తీవ్రవాదుల దాడి.. 600 మంది ఖైదీలు పరార్‌!

ఆ కిరణాలతో ప్లాస్టిక్‌ను సురక్షితంగా కరిగించేయొచ్చు!

ABOUT THE AUTHOR

...view details