బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే రిషి సునాక్ తన పనిని మొదలుపెట్టారు. బ్రిటన్‌ను ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే దిశగా కసరత్తులో భాగంగా సాయంత్రానికే తన టీమ్‌ని ప్రకటించే పనిని షురూ చేశారు. బ్రిటన్ ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్‌ని నియమించిన రిషి.. ప్రస్తుత ఆర్థికమంత్రిగా ఉన్న జెరిమీ హంట్‌ను అదే పదవిలో కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. అలాగే, జేమ్స్ క్లెవర్లీని విదేశాంగ శాఖ కార్యదర్శిగా, బెన్ వాల్సేని డిఫెన్స్ సెక్రటరీగా నియమించారు. పార్లమెంటరీ సెక్రటరీ (చీఫ్ విప్)గా సైమన్ హార్ట్‌ని నియమించగా.. నదిమ్ జాహ్వికి మంత్రిగా అవకాశం కల్పించినప్పటికీ ఆయనకు ఏ శాఖను కేటాయించింది మాత్రం స్పష్టంచేయలేదు. భారత మూలాలు ఉన్న సుయోల్లా బ్రేవర్మన్‌ను తిరిగి హోం సెక్రటరీగా, అలాగే, గ్రాంట్ శాప్స్‌ను ఎనర్జీ, ఇండస్ట్రియల్ స్ట్రాటజీ సెక్రటరీగా నియమించారు.
ఉప ప్రధానిగా డొమినిక్ రాబ్.. తిరిగి హోం సెక్రటరీగా బ్రేవర్మన్.. బ్రిటన్ మంత్రివర్గ విస్తరణ - బ్రిటన్ నూతన కేబినేట్ మంత్రులు
బ్రిటన్ నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే రిషి సునాక్ తన పనిని ప్రారంభించారు. లిజ్ ట్రస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న పలువురిని తమ పదవులకు రాజీనామా చేయాలని సూచించారు.
మరోవైపు, లిజ్ ట్రస్ జట్టులో మంత్రులుగా ఉన్న పలువురిని తమ పదవులకు రాజీనామా చేయాలని రిషి కోరినట్టు సమాచారం. జాకబ్ రీస్- మాగ్, బ్రాండన్ లెవైస్, విక్కీ ఫోర్డ్‌ను తమ పదవుల నుంచి వైదొలగాలని సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. తన సొంత మంత్రివర్గాన్ని ప్రకటించడానికి వీలుగా వీరి నుంచి రాజీనామా కోరినట్టు తెలుస్తోంది. రిషి సునాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాసేపటికే లిజ్ ట్రస్ ప్రభుత్వంలో ఉన్న పలువురు మంత్రులు తమ రాజీనామాలు సమర్పించడం గమనార్హం. ఈ జాబితాలో కిట్ మాల్తౌస్, రాబర్ట్ బక్‌ల్యాండ్, చ్లోల్ స్మిత్, రణిల్ జయవర్దనె వంటి వారు ఉన్నారు. మొదటి నుంచీ తనకు అండగా నిలిచిన వారికి రిషి తన మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది.