బ్రిటన్‌లో వలసలు రికార్డు స్థాయికి చేరడంతో వలసలను తగ్గించేందుకు రిషి సునాక్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా విదేశీ విద్యార్థులపై ఆంక్షలు తీసుకురావాలని యోచిస్తోంది. దేశంలో వలసదారుల సంఖ్య నానాటికీ పెరగుతుండటంతో దీన్ని నియంత్రించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రధాని సునాక్ యోచిస్తున్నారు. ఇందుకోసం విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడం సహా ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. పెద్దగా ప్రాధాన్యం లేని డిగ్రీల కోసం వచ్చే విద్యార్థులు, డిపెండెంట్ వీసాలతో వచ్చే విద్యార్థులపై ఈ ఆంక్షలు ఉండే అవకాశమున్నట్లు సమాచారం. ఈ ఆంక్షలు ఏంటీ? ప్రాధాన్యం లేని డిగ్రీలుగా వేటిని నిర్ణయిస్తారనే దానిపై స్పష్టతలేదు.
విదేశీ విద్యార్థులపై రిషి సునాక్ ఆంక్షలు... భారతీయులపైనే ప్రభావం! - విదేశీ విద్యార్థులపై రిషీ సునాక్ ఆంక్షలు న్యూస్
బ్రిటన్‌లో వలసలను తగ్గించేందుకు విదేశీ విద్యార్థులపై ఆంక్షలు తీసుకురావాలని రిషి సునాక్ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దగా ప్రాధాన్యం లేని డిగ్రీల కోసం వచ్చే విద్యార్థులు, డిపెండెంట్ వీసాలతో వచ్చే విద్యార్థులపై ఈ ఆంక్షలు ఉండే అవకాశమున్నట్లు సమాచారం. భారతీయ విద్యార్థులపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ నేపథ్యంలో బ్రిటన్‌లో తాత్కాలికంగా నివసించే విద్యార్థులను వలసదారులుగా పరిగణించరాదని బ్రిటన్‌లో భారత విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.
బ్రిటన్‌లో ఇటీవల వలసదారుల సంఖ్య అమాంతం పెరిగింది. 2021 జూన్ నాటికి 1.73లక్షల వలసదారులు ఉండగా.. ఈ ఏడాది జూన్ నాటికి ఆ సంఖ్య 5లక్షలు దాటడం గమనార్హం. విదేశీ విద్యార్థుల సంఖ్య పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇటీవలే చైనాను వెనక్కు నెట్టి బ్రిటన్‌లో అత్యధిక విద్యార్థి వీసాలు పొందిన దేశంగా భారత్ నిలిచింది. సునాక్ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే.. భారతీయులపైనే అధిక ప్రభావం ఉండే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐతే వలసదారుల గణాంకాల నుంచి విద్యార్థులను తొలగించాలని బ్రిటన్‌లోని భారత విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. బ్రిటన్‌లో తాత్కాలికంగా నివసించే విద్యార్థులను వలసదారులుగా పరిగణించరాదని విజ్ఞప్తి చేస్తున్నాయి.
బ్రిటన్‌లో విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడం ద్వారా వలసలను నియంత్రించడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. బ్రిటన్‌లో కొన్ని విశ్వవిద్యాలయాలు పూర్తిగా విదేశీ విద్యార్థులపైనే ఆధారపడి నడుస్తున్నాయని ఒకవేళ ఆంక్షలు విధిస్తే.. ఆ యూనివర్శిటీలు దివాలా తీసే ప్రమాదం ఉందని తెలిపారు. విదేశీ విద్యార్థుల ద్వారా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు 30 బిలియన్ పౌండ్ల ఆదాయం లభిస్తోంది. విదేశీ విద్యార్థులపై ఆంక్షలు బ్రిటన్‌కే హాని కలిగిస్తాయని, విశ్వవిద్యాలయాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని యూనివర్శిటీల సంఘం అంటోంది. వలసల విషయంలో యూకే ప్రభుత్వం విమర్శలు, వివాదాలు ఎదుర్కొంటోంది. గతంలో యూకే హోంమంత్రి సుయోల్లా బ్రేవర్మన్ విదేశీ విద్యార్థులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆమె పదవికి రాజీనామా చేశారు. అయితే సునాక్ అధికారంలోకి వచ్చాక, మళ్లీ బ్రేవర్మన్‌ను హోంమంత్రిని చేయడం గమనార్హం.