UK PM race 2022: బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకెళ్లిన భారత సంతతి వ్యక్తి, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్.. అనూహ్యంగా వెనకబడినట్లు తెలుస్తోంది. కన్జర్వేటివ్ ఎంపీల మద్దతుతో తుది పోరులో నిలిచిన రిషికి.. ఆ పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఆశించిన మేర మద్దతు లభించటం లేదని సమాచారం. ఈ విషయాన్ని రిషి సునాక్ సైతం ధ్రువీకరించారు. తాజాగా బ్రిటన్‌లోని గ్రాంథాం నగరంలో ప్రసగించిన సునాక్ తాను వెనకబడి ఉన్నాననడంలో.. ఎలాంటి సందేహాం లేదని స్పష్టం చేశారు. కన్జర్వేటివ్ పార్టీలో కొందరు తన ప్రత్యర్థి, విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్‌ను బ్రిటన్ ప్రధానిగా చేయాలని చూస్తున్నారన్నారు. కానీ, పార్టీ సభ్యులు కొందరు ప్రత్యామ్నాయం కావాలనుకుంటున్నారని రిషి తెలిపారు. వారు తాను చెప్పేది వినేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.
UK PM election 2022: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం రిషి సునాక్‌ను కాకుండా ఇంకెవరినైనా ప్రధాని పీఠం ఎక్కించాలని భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ యూగవ్ నిర్వహించిన సర్వే సైతం సునాక్‌కు వ్యతిరేకంగా వచ్చింది. మొత్తం 730 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను సర్వే చేయగా.. వారిలో 62% మంది ట్రస్‌ను బలపరిచారు. రిషికి 38% మంది మద్దతిచ్చారు. సభ్యుల్లో మహిళలు-పురుషులు, అన్ని వయోవర్గాల వారు, బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసినవారిలో అత్యధికులు ట్రస్‌నే సమర్థించినట్లు యూగవ్ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పీఠాన్ని రిషి అధిరోహిస్తారా అన్న ప్రశ్నంపై నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.