తెలంగాణ

telangana

ETV Bharat / international

'ప్రధానిగా నన్ను ఎన్నుకుంటే.. లైంగిక నేరస్థుల అంతుచూస్తా'

Rishi sunak news: బ్రిటన్ ప్రధానిగా తనను ఎన్నుకుంటే దేశంలో లైంగిక నేరస్థుల పని పడతానని అన్నారు మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్. మహిళలు, బాలికలు స్వేచ్ఛగా తిరగగల సమాజాన్ని సృష్టించేవరకు విశ్రమించబోనని ఆయన తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతుండడం వల్ల రిషి సునాక్ తన ప్రచార వేగాన్ని పెంచారు.

Rishi Sunak
రిషి సునాక్‌

By

Published : Jul 29, 2022, 10:11 AM IST

Rishi sunak news: పాలక కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడిగా, తద్వారా బ్రిటన్‌ ప్రధానమంత్రిగా తనను ఎన్నుకుంటే దేశంలో లైంగిక నేరస్థుల పని పడతానని మాజీ ఆర్థికమంత్రి రిషి సునాక్‌ ప్రజలకు హామీ ఇస్తున్నారు. 'బాలికలు, యువతులపై లైంగిక హింసను జాతీయ ఎమర్జెన్సీగా పరిగణించి రూపుమాపాలి. నాకున్న ఇద్దరు ఆడపిల్లలు సాయంత్రం పూట ధైర్యంగా వ్యాహ్యాళికి వెళ్లగలగాలి. రాత్రిపూట షాపింగు చేయగలగాలి' అంటున్నారు రిషి. బాలికలు, యువతులకు మాయమాటలు చెప్పి లోబరచుకొని అత్యాచారానికి పాల్పడే గ్రూమింగ్‌ గ్యాంగులు, మహిళలకు తెలియకుండా వారి బ్లౌజుల పైనుంచి సెల్‌ ఫోన్లతో ఫోటోలు తీసే డౌన్‌ బ్లౌజింగ్‌ ముఠాలు బ్రిటన్‌లో పెరిగిపోతున్నాయి.

గ్రూమింగ్‌ గ్యాంగుల నాయకులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడానికి, గ్యాంగు సభ్యులపై క్రిమినల్‌ కేసులు పెట్టడానికి సునాక్‌ చట్టంలో తగు మార్పులు చేస్తారని ఆయన ప్రచార బృందం 'రెడీ 4 రిషి' సభ్యులు బుధవారం వివరించారు. గ్రూమింగ్‌ గ్యాంగుల్లో ఎక్కువమంది పాకిస్థానీలే. లైంగిక నేరస్థులపై చర్యలు తీసుకోడానికి జాతిపరమైన అడ్డంకులు ఉండకూడదని సునాక్‌ ఉద్ఘాటించారు. మహిళలు, బాలికలు నిర్భయంగా స్వేచ్ఛగా తిరగగల సమాజాన్ని సృష్టించేవరకు విశ్రమించబోనని చెప్పారు. గ్రూమింగ్‌ గ్యాంగులు ఏ నగరం లేదా పట్టణంలో చెలరేగినా తక్షణం రంగంలోకి దిగే కొత్త ఎమర్జన్సీ కార్యదళాన్ని జాతీయ నేర నియంత్రణ సంస్థ (ఎన్‌సీఏ) ఛత్రం కింద ఏర్పాటు చేస్తానని ప్రకటించారు.

కాస్త మెరుగైన ఆదరణ..
పాలక కన్జర్వేటివ్‌ ఎంపీల్లో ఎక్కువమంది రిషి సునాక్‌ను సమర్థిస్తున్నా.. పార్టీ క్రియాశీలక సభ్యులు, కార్యకర్తలు సునాక్‌ కన్నా ఆయన పోటీదారైన విదేశాంగమంత్రి లిజ్‌ ట్రస్‌ వైపే ఎక్కువ ఆదరణ చూపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం వెల్లడైన యూగవ్‌ సంస్థ కొత్త సర్వేలో సునాక్‌ తన పట్ల ఆదరణను కొద్దిగా పెంచుకున్నట్లు తేలింది. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు వచ్చేవారం తపాలా బ్యాలెట్‌ ద్వారా తమ నిర్ణయాన్ని తెలియజేస్తారు. వీరు పార్టీ నాయకుడిగా ఎన్నుకున్న వ్యక్తే ప్రధాని పీఠం ఎక్కుతారు.

ఇవీ చదవండి:'ఇక అణ్వాయుధాలతోనే జవాబు!'.. ఆ దేశాలకు కిమ్ వార్నింగ్

'మగవారూ.. శృంగార భాగస్వాములను తగ్గించుకోండి'

ABOUT THE AUTHOR

...view details