UK pm election: బ్రిటన్ ప్రధానమంత్రి ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. సైబర్ హ్యాకర్ల కారణంగా ఓటింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రజా బ్యాలెట్‌ను కొంతమంది హ్యాకర్లు మార్చేందుకు యత్నిస్తున్నారంటూ యూకే ప్రభుత్వ కమ్యూనికేషన్స్ హెడ్ క్వార్టర్స్ (జీసీహెచ్‌క్యూ) హెచ్చరించింది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. 1,60,000 మంది టోరీ సభ్యులకు సోమవారం నుంచే పోస్టల్ బ్యాలెట్ పంపాల్సి ఉంది. అయితే హ్యాకర్లు బ్యాలెట్ మార్చేందుకు యత్నించవచ్చన్న అనుమానాలతో పోస్టల్ బ్యాలెట్లు ఆగస్ట్ 11నాటికి చేరుకోవచ్చని జీసీహెచ్‌క్యూ తెలిపింది. ఈ మేరకు టోరీ సభ్యులకు సమాచారం పంపినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అదనపు సెక్యూరిటీతో ప్రక్రియ కొనసాగుతుందన్న జీసీహెచ్‌క్యూ ఫలితంగా ఓటింగ్ ప్రక్రియ కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపింది.
బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత రిషి సునాక్.. తన సమీప ప్రత్యర్థి లిజ్‌ట్రస్ కంటే వెనుకంజలో ఉన్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈ పదవి కోసం జరుగుతున్న పోరులో ప్రారంభ దశలోనే ఉన్నామన్న.. ఆయన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. పలు వివాదాల్లో కూరుకుపోయిన బోరిస్ జాన్సన్ ఈ నెల 7వ తేదీన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రక్రియ చేపట్టింది. పార్టీ అధ్యక్ష పదవికి, తద్వారా ప్రధాని పదవికి ఎన్నిక మొదలవగా.. ఇందుకోసం తొలుత 11 మంది పోటీ పడ్డారు. అనేక రౌండ్ల అనంతరం తుది రేసులో మాజీ ఆర్థిక మంత్రి సునాక్, మాజీ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ నిలిచారు.
కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలతోపాటు సభ్యుల మద్దతునూ చూరగొన్నవారే పార్టీ అధ్యక్షులుగా, ప్రధానిగా బాధ్యతలు చేపడుతారు. ఈ క్రమంలోనే టోరీ సభ్యుల మద్దతు కూడగట్టేందుకు వీరిద్దరు ఆరువారాల దేశ పర్యటన ప్రారంభించారు. ఇప్పటికే పలు ఓటర్లతో మాట్లాడుతూ మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వెలువడుతున్న సర్వేలు రిషి కంటే ట్రస్ ముందు వరుసలో ఉన్నట్లు నివేదిస్తున్నాయి. దీనిపై ఆయన స్పందిస్తూ.. 'మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం. రానున్న రోజుల్లో మీలో చాలామందిని కలిసేందుకు ఎదురుచూస్తున్నాను' అని తన పార్టీ సభ్యులను కలిసేముందు బుధవారం ట్వీట్ చేశారు.