UK King coronation : బ్రిటన్ రాజు ఛార్లెస్-3 పట్టాభిషేకానికి రంగం సిద్ధమైంది. శనివారం ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రపంచదేశాల అధినేతల మొదలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు బ్రిటన్ తరలివచ్చారు. సుమారు 2వేల మంది అతిథులు, రాజకుటుంబీకులు, విదేశీ ప్రముఖుల సమక్షంలో లండన్ వెస్ట్‌మినిస్టర్ అబేలో ఈ పట్టాభిషేకం జరుగుతుంది. పట్టాభిషేక కార్యక్రమంలో తొలుత కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్ కింగ్ ఛార్లెస్‌ను ఆహూతులకు పరిచయం చేస్తారు. అన్నివైపులా కనిపించేలా నాలుగు దిక్కులా రాజు ప్రదక్షిణ చేస్తున్నట్లు తిరుగుతుంటే ఈ పరిచయం కొనసాగుతుంది. సభికులు 'గాడ్ సేవ్ ది కింగ్' అంటూ ఆశీర్వదిస్తారు.
Coronation King Charles iii : చట్టాన్ని కాపాడతానని, దయతో, న్యాయంతో పాలన కొనసాగిస్తానని ఛార్లెస్ ప్రమాణం చేస్తారు. 973లో కింగ్ ఎడ్గర్ పట్టాభిషేకం సమయంలో చేసిన ప్రమాణంలోని భాగాల్నే చదువుతారు. తర్వాత చర్చి ఆఫ్ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన ప్రొటెస్టెంట్ క్రిస్టియన్‌గా ఉంటానని ఛార్లెస్ రెండో ప్రమాణం చేస్తారు. ప్రమాణం పూర్తికాగానే 1300 సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్ చేయించిన సింహాసనంపై కూర్చుంటారు. ఈ సింహాసనం పాతదే అయినా దీనికి సొబగులు అద్దారు. దీనికింది అరలో స్కాట్లాండ్ నుంచి తెచ్చిన పవిత్ర రాయిని ఉంచుతారు. 14వ శతాబ్దం నుంచీ పట్టాభిషేకానికి ఇదే కుర్చీని వాడుతున్నారు. ఆ వెంటనే ఆర్చ్‌బిషప్ కింగ్ ఛార్లెస్‌ను పవిత్ర నూనెతో అభిషేకిస్తారు. చేతులు, ఛాతీ, తలపై నూనెను పోస్తారు. ఇదంతా తెరచాటున జరుగుతుంది. జెరూసలెంలోని పర్వతశ్రేణి మౌంట్ ఆఫ్ ఆలివ్స్‌లోని ఆలివ్ చెట్ల నుంచి తీసిన నూనెను గులాబీ, మల్లె తదితర సుగంధాలతో కలిపి తయారు చేసి తీసుకొస్తారు.
నూనెతో అభిషేకం పూర్తికాగానే.. ఛార్లెస్‌కు బంగారుతాపడంతో చేసిన మహారాజ గౌన్ తొడిగి కూర్చోబెడతారు. ఆ తర్వాత శిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండంను ఆర్చ్‌బిషప్ ఆయనకు అందిస్తారు. కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగి కిరీట ధారణ చేస్తారు. దీన్ని సెయింట్ ఎడ్వర్డ్ కిరీటం అంటారు. 1661లో తయారైన 2.23 కిలోల బరువైన ఈ బంగారు కిరీటాన్ని పట్టాభిషేకం రోజున ఒక గంటసేపు మాత్రమే ధరిస్తారు. ఆ తర్వాత తదుపరి రాజు పట్టాభిషేకం దాకా దీన్ని భద్రంగా దాచిపెడతారు. ప్రజల దర్శనార్థం ఛార్లెస్ మరో కిరీటాన్ని ధరిస్తారు. కిరీట ధారణ కాగానే.. వచ్చిన ఆహుతులంతా మరోమారు 'గాడ్ సేవ్ ది కింగ్' అంటూ నినాదాలు చేస్తారు.