UK By Elections Results : బ్రిటన్‌లో రిషి సునాక్ నాయకత్వంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్‌లో మొత్తం 3 పార్లమెంట్ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల కన్జర్వేటివ్ పార్టీ ఓటమి చవిచూసింది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని సెల్బే-అయిన్‌స్టీ సీటులో లేబర్ పార్టీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. ఇక మరో స్థానమైన సోమర్టన్-ఫ్రోమ్‌ను లిబరల్ డెమోక్రటిక్ పార్టీ గెలుచుకొంది. ఇక కన్జర్వేటివ్ పార్టీ ఉక్స్‌బ్రిడ్జ్-సౌత్ రూయిస్లిప్ సీటును మాత్రం దక్కించుకొంది. గతంలో ఇది బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గెలిచిన స్థానం. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఇక్కడ కన్జర్వేటివ్ పార్టీ గతంలో కంటే బలపడింది.
British By Election Results : ఈ ఉప ఎన్నికల ఫలితాలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ నాయకత్వంపై ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఓటములతో వచ్చే జనరల్ ఎలక్షన్స్ అధికార కన్జర్వేటివ్ పార్టీకి పెనుసవాల్‌గా మారనున్నాయని అంటున్నారు. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్‌అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లో పార్టీ నాయకులు పలు వివాదాలు, కుంభకోణాల్లో చిక్కుకున్నారు. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణం ఒత్తిడి వంటివి పార్టీ పాపులారిటీని మరింత తీవ్రంగా దెబ్బతీశాయి.