తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీతో భేటీ తర్వాత.. భారతీయులకు రిషి గుడ్‌న్యూస్‌.. ఏటా 3వేల వీసాలను..

భారత యువ నిపుణుల కోసం యూకే సరికొత్త వీసా పథకాన్ని తీసుకొచ్చింది. దీని కింద ఏటా 3000 వీసాలు అందించనుంది.

rishi sunak modi
rishi sunak modi

By

Published : Nov 16, 2022, 10:46 AM IST

Updated : Nov 16, 2022, 12:00 PM IST

యూకే వెళ్లాలనుకునే భారతీయులకు బ్రిటన్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి యూకే ప్రధాని రిషి సునాక్‌ ఆమోదం తెలిపారు. జి-20 సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో రిషి సునాక్ భేటీ అయిన కొద్ది గంటలకే యూకే ప్రభుత్వం ఈ ప్రకటన వెలువర్చడం ప్రాధాన్యత సంతరించుకుంది.

"యూకే-ఇండియా యువ నిపుణుల వీసా పథకాన్ని ప్రకటిస్తున్నాం. ఈ పథకం కింద భారత్‌కు చెందిన 18-30 ఏళ్ల డిగ్రీ విద్యావంతులకు ఏటా 3000ల వీసాలు అందజేస్తాం. వారు యూకేకు వచ్చి రెండేళ్ల వరకు ఉద్యోగం చేసుకునేందుకు వీలుంటుంది" అని బ్రిటన్‌ ప్రధాని కార్యాలయం నేడు ట్విటర్‌లో వెల్లడించింది. ఇరు దేశాల మధ్య వలస భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా ఈ పథకాన్ని ఆమోదించామని, దీని కింద ప్రయోజనం పొందిన తొలి దేశం భారత్‌ అని యూకే ప్రభుత్వం తెలిపింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, రెండు ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో బలమైన బంధాలను ఏర్పరుచుకోవడానికి ఈ పథకం దోహదపడుతుందని డౌనింగ్‌ స్ట్రీట్ ఓ ప్రకటనలో పేర్కొంది.

కాగా.. జి-20 సదస్సులో ఇరు దేశాధినేతల భేటీ జరిగిన కొద్ది గంటలకే సునాక్‌ సర్కారు ఈ వీసా పథకాన్ని ప్రకటించింది. ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగుతున్న జి-20 సదస్సులో భాగంగా భారత ప్రధాని మోదీ, యూకే ప్రధాని రిషి సునాక్‌ నిన్న కొద్దిసేపు ముచ్చటించారు. భారత సంతతికి చెందిన సునాక్‌.. బ్రిటన్‌ అధికార పీఠమెక్కిన తర్వాత.. వీరిద్దరూ ముఖాముఖి మాట్లాడటం ఇదే తొలిసారి.

మరోవైపు, భారత్‌-యూకే మధ్య ప్రస్తుతం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల దశలో ఉంది. ఇది కుదిరితే.. ఓ ఐరోపా దేశంతో భారత్‌ ఈ తరహా ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి కానుంది. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు వీలుగా ఈ ఒప్పందంపై ఇరు దేశాలు ఈ ఏడాది ఆరంభంలో చర్చలు ప్రారంభించాయి. దీని ప్రకారం.. రెండు దేశాలు గరిష్ఠ వస్తువులపై కస్టమ్స్‌ సుంకాలను భారీగా తగ్గించడమో లేదా తొలగించడమో చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పెట్టబడులను ప్రోత్సహించేలా నిబంధనలను సులభతరం చేయాలి. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశకు చేరుకున్నాయి.

Last Updated : Nov 16, 2022, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details