భారతీయులకు గుడ్న్యూస్ చెప్పింది యూకే ప్రభుత్వం. 18 నుంచి 30 ఏళ్ల వయసున్న అర్హులైన భారతీయ యువతకు 'యూకే-ఇండియా యువ నిపుణుల ఒప్పందం' కింద 2,400 వీసాలు జారీ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను ఓ ప్రకటనలో వెల్లడించింది.
అభ్యర్థి వీసా పొందాలంటే ముందుగా బాలెట్ దశలో ఎంపికవ్వాలి. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు బాలెట్ నమోదుకు అవకాశం ఉంటుంది. దీనిని ఉచితంగానే చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ మొదలుపెట్టాలంటే ఈ వీసా పొందడానికి పూర్తి అర్హత ఉందని అభ్యర్థి తప్పనిసరిగా ప్రకటించాలి. బాలెట్ దశలో ఎంపికయిన అభ్యర్థులు నిర్దేశించిన గడువులోగా వీసాకు దరఖాస్తు చేసుకోవాలి. మంజూరైన తర్వాత ఆరు నెలల్లోగా యూకేకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ దఫా వీసా పొందలేకపోతే జులైలో ప్రారంభమయ్యే రెండో బాలెట్ ద్వారా మరోసారి ప్రయత్నించొచ్చు. భారత్, యూకే ప్రభుత్వాల మధ్య ఇటీవల కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం యూకే యువత రెండేళ్ల పాటు భారత్‌లో ఉండొచ్చు. అదే విధంగా భారతీయులకూ యూకేలో నివసించే అవకాశం ఉంటుంది.