తెలంగాణ

telangana

ETV Bharat / international

పాఠశాలలో మారణహోమం.. తిరుగుబాటుదారుల దాడిలో 38 మంది విద్యార్థులు మృతి

Uganda School Attack : ఉగాండాలోని ఓ పాఠశాలపై ఏడీఎఫ్​ సంస్థకు చెందిన తిరుగుబాటుదారులు జరిపిన దాడిలో 38 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Uganda School Attack
Uganda School Attack

By

Published : Jun 17, 2023, 12:30 PM IST

Updated : Jun 17, 2023, 3:05 PM IST

Uganda School Attack : ఉగాండాలోని ఓ పాఠశాలపై ISISతో సంబంధాలు కలిగి ఉన్న ఏడీఎఫ్​ సంస్థకు చెందిన సాయుధ తిరుగుబాటుదారులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 38 మంది విద్యార్థులు సహా 41 మంది మరణించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిందీ ఘటన. ఈ పాఠశాల కాంగో సరిహద్దుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది.

"దేశ సరిహద్దు పట్టణమైన మాండ్వేలోని లుబిరిహా సెకండరీ పాఠశాలపై శుక్రవారం అర్ధరాత్రి ఏడీఎఫ్​కు చెందిన తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. పాఠశాల వసతి గృహాన్ని తిరుగుబాటుదారులు తగులబెట్టారు. పాఠశాల నుంచి పలువురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. బ్వేరా ఆసుపత్రికి తరలించాం. మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని స్థానిక ఆస్పత్రికి తరలించాం."
--ఉగాండా పోలీసులు

దాడి అనంతరం తిరుగుబాటుదారులు కాంగో దేశంలోని విరుంగా జాతీయ పార్కు దిశగా పారిపోయినట్లు గుర్తించామని, వారిని వెంటాడుతున్నామని పోలీసులు చెప్పారు. పరారయ్యే ముందు పలువురిని అపహరించుకుపోయినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. పాఠశాలపై తిరుగుబాటుదారులు చేసిన దాడిని 'పిరికిపంద' చర్యగా అభివర్ణించారు ఉగాండా రాజకీయ నాయకురాలు విన్నీ కిజా. పాఠశాలలపై దాడులు ఆమోదయోగ్యం కాదని.. ఆమె అన్నారు. స్కూళ్లు విద్యార్థులకు ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రదేశంగా ఉండాలని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా.. 1986 నుంచి అధికారంలో ఉన్న ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని పాలనను ఏడీఎఫ్‌ వ్యతిరేకిస్తోంది. 2001లో ఉగాండా సైన్యం ఎదురుదాడులతో తూర్పు కాంగోలోకి పారిపోయి.. అక్కడినుంచి హింసకు తెగబడుతోంది. ఏడీఎఫ్‌కు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తోనూ సంబంధాలు ఉన్నాయి. దీంతో ఏడీఎఫ్‌ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు ఉగాండా ప్రభుత్వం వైమానిక, ఫిరంగి దాడులు చేపడుతోంది.

పాఠశాలలో అగ్నిప్రమాదం.. 11 మంది..
ఉగాండాలోని 2022 అక్టోబరు నెలలో అంధుల బోర్డింగ్ స్కూల్​లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 11 మంది బాలికలు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగాండా రాజధాని కంపాలాకు సమీపంలోని ముకునోలో ఈ దుర్ఘటన జరిగింది. అంధుల కోసం ఏర్పాటు చేసిన సలామా రెసిడెన్షియల్ పాఠశాల డార్మిటరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో నిద్రిస్తున్న బాలికలు సజీవ దహనమయ్యారు. మృతుల వయసు 7 నుంచి 10 ఏళ్ల మధ్య ఉంటుందని అధికారులు తెలిపారు.

Last Updated : Jun 17, 2023, 3:05 PM IST

ABOUT THE AUTHOR

...view details