తెలంగాణ

telangana

ETV Bharat / international

బ్రిటన్​లో రాజకీయ సంక్షోభం.. మరో నలుగురు మంత్రుల రాజీనామా - బ్రిటన్ మంత్రుల రాజీనామా

Britain political crisis: బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్ స‌ర్కార్ రాజ‌కీయ సంక్షోభంలో చిక్కుకుంది. మంగళవారం ఆర్థిక మంత్రి రిషి సునాక్​, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్​ రాజీనామా చేయగా.. తాజాగా మరో నలుగురు మంత్రులు అదే బాటలో నడిచారు.

britain political crisis
britain political crisis

By

Published : Jul 6, 2022, 3:13 PM IST

Updated : Jul 6, 2022, 4:20 PM IST

Britain political crisis: బ్రిటన్​ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్​కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఆర్థిక మంత్రి రిషి సునాక్​, ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్​ రాజీనామా చేయగా.. తాజాగా మరో నలుగురు మంత్రులు అదే బాటలో పయనించారు. మొదట శిశు, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విల్​ క్విన్స్​, రవాణాశాఖ మంత్రి లారా ట్రాట్​ రాజీనామా చేశారు. తర్వాత కొద్ది సేపటికే మంత్రులు జాన్​ గ్లెన్​, విక్టోరియా అట్కిన్స్​ తమ పదవులకు రాజీనామా సమర్పించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఉన్నత పదవిలో కూర్చోబెట్టారని క్విన్స్​ విమర్శించారు. ఈ తరుణంలో తనకు రాజీనామా తప్ప మరో మార్గం లేదని లేఖలో తెలిపారు. బోరిస్ జాన్సన్​ ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయినందుకే రాజీనామా చేస్తున్నట్లు రవాణా మంత్రి లారా ట్రాట్ చెప్పారు.

కొనసాగలేకే రాజీనామా: ప్రభుత్వాన్ని వీడడం బాధగా ఉందని.. కానీ ఇక్కడ కొనసాగలేకే ఈ నిర్ణయానికి వచ్చానని సునాక్​ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. బ్రిటన్​ను కర్మభూమిగా కీర్తించిన సునాక్.. తన లాంటి వారు సైతం ఛాన్సలర్​ అయ్యే అవకాశం ఇక్కడ ఉందన్నారు. పించర్​ ఆరోపణలపై ప్రభుత్వం పారదర్శకమైన విచారణ చేపట్టాలని ప్రజలు ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏ ప్రమాణాల కోసం రాజీనామా చేశానో.. వాటి కోసం పోరాడుతానన్నారు.

"మన దేశం కఠినమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. తక్కువ పన్నులతో ఆర్థిక వృద్ధి సాధించి ప్రపంచ స్థాయి ప్రజా సేవలు అందించాలనుకున్నాం. అయితే ఇది సాధించాలంటే కఠిన నిర్ణయాలు, త్యాగాలకు వెనకాడబోవద్దు. ప్రజలు సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారాని నేను గట్టిగా నమ్ముతాను."

-రిషి సునాక్​, బ్రిటన్ మాజీ ఆర్థిక మంత్రి

ఆర్థిక మంత్రి సునాక్ రాజీనామాపై ప్రధాని బోరిస్ జాన్సన్​ స్పందించారు. సునాక్​ లాంటి అద్భుతమైన నాయకుడిని కోల్పోవడం నిరాశకు గురిచేసిందని అన్నారు. కొవిడ్​ సంక్షోభంలో సునాక్​ తీసుకున్న నిర్ణయాలు అనేక మంది ఉద్యోగాలు కోల్పోకుండా కాపాడాయని కొనియాడారు.

కొత్త మంత్రులను నియమించిన ప్రధాని..: బ్రిటన్​ ఆరోగ్య శాఖ, ఆర్థిక శాఖ మంత్రులు రాజీనామా చేసిన వెంటనే ఆ దేశ ప్రధానమంత్రి బోరిన్​ జాన్సన్ కొత్త మంత్రులను నియమించారు. యూకే కేబినెట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీవ్ బార్క్లే.. ఆరోగ్య శాఖ మంత్రిగా, విద్యా కార్యదర్శి నదీమ్ జహావి ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు.

2019లో ప్రధాని జాన్సన్‌... క్రిస్‌ పించర్‌ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్‌ విప్‌గా నియమించారు. అప్పటికే అతని నడవడికకు సంబంధించి పలు ఆరోపణలున్నాయి. ఆ విషయాన్ని ప్రభుత్వాధికారులు చెప్పినా జాన్సన్‌ పట్టించుకోకుండా క్రిస్‌ పించర్‌ను కీలకమైన పదవిలో కూర్చోబెట్టారు. ఇటీవల ఒక క్లబ్‌లో తాగిన మత్తులో క్రిస్‌ పించర్‌ ఇద్దరు పురుషుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

అయితే అతను ఇలాంటి వాడని తనకు తెలియదని ప్రధాని బోరిస్‌ తన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, పించర్‌ గురించి తాము ముందే నివేదించామని మాజీ అధికారి ఒకరు చెప్పడంతో బోరిస్‌ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. దీంతో బోరిస్‌పై తమకు విశ్వాసం లేదంటూ రిషి సునాక్‌, జావిద్‌ నిన్న మంత్రి పదవుల నుంచి తప్పుకొన్నారు. ప్రధాని కూడా వైదొలగాలని డిమాండ్‌ చేశారు. తాజాగా మరో ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా చేయడంతో బోరిస్‌ ప్రభుత్వం మరింత సంక్షోభంలో కూరుకుపోయినట్లయింది.

ఇదీ చదవండి:బోరిస్​ జాన్సన్​కు షాక్.. రిషి సునాక్ రాజీనామా.. మరో మంత్రి కూడా..

Last Updated : Jul 6, 2022, 4:20 PM IST

ABOUT THE AUTHOR

...view details