Narendra Modi Egypt Visit : అమెరికాలో అధికారిక పర్యటన అనంతరం ఈజిప్టు చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఆ దేశ ప్రధాని ముస్తాఫా మద్బౌలితో చర్చించారు. వ్యాపార, ఆర్థిక, వాణిజ్యం, పెట్టుబడులు, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, ఐటీ, డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ, ఫార్మా తదితర రంగాలలో సహకారాన్ని మరింత మెరుగుపరచుకోవడంపై చర్చలు జరిపారు. ఈ మేరకు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఏడుగురు క్యాబినెట్ మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారైనట్లు భారత విదేశాంగ కార్యదర్శి అరిందమ్ బాగ్చి ట్విట్టర్లో వెల్లడించారు.
ప్రధానమంత్రి ఆదివారం వెయ్యేళ్ల చరిత్ర కలిగిన.. ప్రఖ్యాత అల్ హకీం మసీదును సందర్శిస్తారు. అనంతరం మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు తరఫున పోరాటి భారత సైనికులకు నివాళులు అర్పించేందుకు హెలియోపోలిస్ వార్ గ్రేవ్ శ్మశానవాటికను కూడా సందర్శించనున్నారు. అధ్యక్షుడు ఎల్-సిసితో.. మోదీ భేటీ అవుతారు. మేధావులతో భేటీ అవుతారు.
ఆఫ్రికా ఖండంలో భారత్ ముఖ్యమైన భాగస్వామ్య దేశాలలో ఈజిప్టు ఒకటి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద 1978లో జరిగింది. ఈజిప్షియన్ సెంట్రల్ ఏజెన్సీ ఫర్ పబ్లిక్ మొబిలైజేషన్ (CAPMAS) లెక్కల ప్రకారం ఏప్రిల్ 2022-డిసెంబర్ 2022 కాలంలో ఆదేశానికి.. ఐదో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా భారత్ ఉంది.
ప్రముఖులతో మోదీ సమావేశం..
ఈజిప్టు పర్యటనలో భాగంగా శనివారం పలువురు ప్రముఖులను కూడా మోదీ కలిశారు. ఈజిప్టు కంపెనీ హసన్ అల్లం సీఈఓ హసన్ అల్లం, ప్రఖ్యాత రచయిత తారెక్ హెగ్గీ మోదీ సమావేశమయ్యారు. ఆ దేశ ప్రముఖ ముఫ్తీ.. షాకీ ఇబ్రహీం అబ్దుల్-కరీం అల్లంను కూడా మోదీ కలిశారు. సామాజిక సామరస్యం, తీవ్రవాదంపై పోరు వంటి అంశాలపై చర్చించారు. ఈజిప్టునకు చెందిన ఇద్దరు యోగీ టీచర్లను కూడా మోదీ కలిశారు. యోగా పట్ల వారికి ఉన్న నిబద్ధతను ఆయన ప్రశంసించారు.
ఈజిప్టులో మోదీకి ఘనతం స్వాగతం..
అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ప్రధాని మోదీ.. శనివారం మధ్యాహ్నం ఈజిప్టు రాజధాని కైరో చేరుకున్నారు. రెండు రోజులపాటు.. అక్కడ పర్యటించనున్న ఆయనకు, విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని ముస్తాఫా మద్‌బౌలి ఘన స్వాగతం పలికారు. గార్డులు గౌరవ వందనం చేశారు. ఆయన బసచేసే.. హోటల్ వద్దకు భారీగా చేరుకున్న ప్రవాస భారతీయులు మోదీ మోదీ, వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. హోటల్ వద్ద భారతీయ సంప్రదాయ చీర ధరించిన.... ఈజిప్టు మహిళ షోలేలోని 'యే దోస్తీ హమ్ నహీ ఛోడేంగే' పాట పాడుతూ స్వాగతం పలికారు. భారత్‌ను ఎప్పుడూ సందర్శించని, హిందీ అంతగా రాని.. ఆ మహిళ పాడిన పాటకు మోదీ ముగ్ధుడయ్యారు. గత 26 ఏళ్లలో భారత ప్రధాని.. ఈజిప్ట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి!