Twitter One Word Trend: ప్రముఖ సామాజిక మాధ్యమం 'ట్విట్టర్’లో ఎప్పుడూ ఏదో ఒక అంశం ట్రెండింగ్‌లో ఉంటుంది. సాధారణ నెటిజన్ల మొదలు ప్రముఖ సంస్థలు, సెలెబ్రిటీల వరకు ఇందులో భాగమవుతారు! ఈ క్రమంలోనే ట్విట్టర్లో తాజాగా వన్ వర్డ్ ట్రెండ్ నడుస్తోంది. అంటే.. ఎవరైనా యూజర్ కేవలం ఒకే పదాన్ని ట్వీట్ చేయడం అన్నమాట. ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ సైతం ఇందులో చేరిపోయారు. శుక్రవారం ఆయన 'క్రికెట్' అనే పదాన్ని పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైతం 'డెమోక్రసీ(ప్రజాస్వామ్యం)' అనే పదాన్ని ట్వీట్ చేశారు.
అసలు ఎలా మొదలైంది..
అమెరికాలోని రైలు సేవల సంస్థ 'ఆమ్‌ట్రాక్' సోషల్ మీడియా టీం.. తమ ట్విట్టర్ హ్యాండిల్‌లో గురువారం 'ట్రైన్స్' అని ఒక పదాన్ని పోస్ట్ చేసింది. ఇది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక్కడినుంచే వన్ వర్డ్ ట్రెండింగ్ మొదలైనట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఈ ట్వీట్‌కు ఇప్పటివరకు లక్షన్నరకుపైగా లైక్స్ రావడం గమనార్హం. క్రమంగా ప్రముఖ సంస్థలతోపాటు వ్యక్తులూ ఈ ట్రెండింగ్‌లో భాగస్వాములవుతున్నారు.