తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెరికా ఎన్నికల్లో గద్దె విజయ జోక్యం!.. వారికి అనుకూలంగా పని'.. బాంబు పేల్చిన మస్క్ - hunter biden laptop story

ట్విట్టర్ మాజీ ఉన్నత ఉద్యోగి విజయ గద్దెపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్​ సీఈఓ ఎలాన్ మస్క్ విడుదల చేశారు. దీనిపై స్వతంత్ర జర్నలిస్టు మాట్ తైబీ విశ్లేషణ చేపట్టారు. అందులో కీలక అంశాలు ఉన్నాయి. అవేంటంటే?

TWITTER VIJAYA GADDE
TWITTER VIJAYA GADDE

By

Published : Dec 3, 2022, 2:26 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేశారంటూ ట్విట్టర్ లీగల్ సెల్ మాజీ అధిపతి విజయ గద్దెపై ఆరోపణలు గుప్పుమన్నాయి. 2020 ఎన్నికల సమయంలో జో బైడెన్ టీమ్​తో విజయ గద్దె జరిపిన సంభాషణలు బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ విడుదల చేశారు. జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​కు సంబంధించిన విషయం ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. 'హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​' అంశంపై సెన్సార్​షిప్ విధించడం వెనక విజయ గద్దె క్రియాశీలంగా పనిచేశారని స్వతంత్ర జర్నలిస్టు, రచయిత మాట్ తైబీ పేర్కొన్నారు.

మాట్ తైబీ కథనం ప్రకారం.. 2020 అక్టోబర్ 14న హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​లోని రహస్య ఈమెయిల్స్ గురించి న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రచురించింది. ఈ కథనం ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ట్విట్టర్.. తీవ్రమైన చర్యలకు పాల్పడింది. హంటర్ బైడెన్ న్యూయార్క్ పోస్ట్​ కథనానికి సంబంధించిన లింకులను తొలగించడమే కాకుండా, వాటికి వార్నింగ్ సందేశాలు జత చేసింది. "చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన కేసుల్లో వినియోగించే ఓ టూల్​ ద్వారా హంటర్ బైడెన్ స్టోరీ ఎక్కువగా రీచ్ కాకుండా ట్విట్టర్​ అడ్డుకుంది. ఈ నిర్ణయాన్ని ట్విట్టర్ ఉన్నతస్థాయి ఉద్యోగులే తీసుకున్నారు. కానీ ఈ విషయం అప్పటి సీఈఓ జాక్ డోర్సీకి తెలియదు. ట్విట్టర్ లీగల్, పాలసీ హెడ్ విజయ గద్దె ఇందులో కీలక పాత్ర పోషించారు" అని తైబీ వివరించారు.

ఈ విషయంపై డెమొక్రటిక్ పార్టీ చట్టసభ్యుడు, భారత సంతతికి చెందిన రో ఖన్నా.. విజయ గద్దెకు మెయిల్ రాశారని తైబీ వివరించారు. హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​ స్టోరీపై ట్విట్టర్ ఎందుకు సెన్సార్​షిప్ విధించిందనే విషయంపై ఆరా తీశారని చెప్పారు. "బైడెన్ పక్షపాతిగానే ఈ విషయం నేను అడుగుతున్నా. ఆయన ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నా. ఈమెయిల్స్ (హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​లోని) విషయంలో ఎలాంటి సమస్య లేదు. కానీ, ఇప్పుడీ సెన్సార్​షిప్.. అంతకంటే పెద్ద సమస్యగా మారిపోయింది. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో న్యూస్​పేపర్ ఆర్టికల్స్​ను నియంత్రించడం.. మంచికంటే చెడే ఎక్కువగా చేస్తుంది. తీవ్రమైన నేరాలు లేదా ఇతర అంశాలకు సంబంధించి ఏదైనా రహస్య సమాచారం ఉంటే వాటిని పబ్లిష్ చేసే హక్కు న్యూయార్క్ టైమ్స్​కు ఉంటుంది. ఎవరో చేసిన చట్టవిరుద్ధ చర్యలకు జర్నలిస్టులను బాధ్యులను చేయకూడదు" అని రో ఖన్నా తన ఈమెయిల్​లో పేర్కొన్నారని తైబీ వివరించారు. ఈ వివరాలను బయటకు చెప్పొద్దని సైతం రో ఖన్నా.. విజయ గద్దెకు సూచించారని వెల్లడించారు. ఖన్నా మెయిల్​కు బదులు ఇచ్చిన విజయ గద్దె.. వ్యక్తిగత సమాచారాన్ని, హ్యాకింగ్ చేసిన మెటీరియల్​తో కలిపి పబ్లిష్ చేసిన కారణంగానే.. తాము కంటెంట్​ను నియంత్రించినట్లు చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే ఇది జరిగిందని వివరణ ఇచ్చారు.

'వారు ఎలా చెబితే అలా..'
అయితే, రాజకీయ పార్టీలు చెప్పినట్లు ట్విట్టర్ నడుచుకొందని తైబీ ఆరోపించారు. పార్టీ ప్రతినిధుల నుంచి అభ్యర్థనలు రాగానే.. వాటిపై చర్యలు తీసుకునేదని వివరించారు. నకిలీ, మోసపూరిత ట్వీట్లను నియంత్రించేందుకు తీసుకొచ్చిన కొన్ని టూల్స్​ను.. ఇతర అవసరాల కోసం ట్విట్టర్ ఉపయోగించిందని తైబీ పేర్కొన్నారు.

"తొలుత ట్వీట్లను మేనిప్యులేట్ చేయాలని బయటి వ్యక్తుల నుంచి అభ్యర్థనలు మొదలయ్యాయి. 2020 నాటికి ట్వీట్లను డిలీట్ చేయాలని వచ్చే అభ్యర్థనలు ట్విట్టర్​లో సాధారణంగా మారిపోయాయి. ట్విట్టర్ ఎగ్జిక్యూటివ్​ ఉద్యోగులు దీనిపై సంభాషణలు జరిపేవారు. 'బైడెన్ టీమ్ నుంచి రివ్యూలు వచ్చాయి' అని సందేశాలు వచ్చేవి. వీటిని పరిశీలించి 'పని పూర్తైంది' అని ప్రత్యుత్తరం పంపేవారు. అయితే, రెండు పార్టీలూ దీన్ని ఉపయోగించుకున్నాయి. బైడెన్ ప్రచార బృందంతో పాటు, 2020లో శ్వేతసౌధం నుంచీ అభ్యర్థనలు వచ్చాయి. అయితే, ఈ విషయంలో ట్విట్టర్.. నిష్పక్షపాతంగా ఉండేది కాదు. ఉద్యోగులకు ఉన్న కాంటాక్ట్స్​పై ఇది ఆధారపడి ఉండేది. ట్విట్టర్​లోని ఉద్యోగుల్లో ఎక్కువ శాతం మంది వామపక్ష (చాలావరకు డెమొక్రాట్లు) భావజాలం ఉన్నవారే. కాబట్టి వీరికి, డెమొక్రాట్ల నుంచే ఎక్కువ అభ్యర్థనలు వచ్చేవి" అని తైబీ వివరించారు.

ఎవరీ విజయ గద్దె?
ట్విట్టర్​లోని కీలక వ్యక్తుల్లో విజయ గద్దె ఒకరు. ట్విట్టర్ పాలసీ వ్యవహారాలు ఈమే చూసుకునేవారు. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిషేధించడంలోనూ విజయ కీలకంగా వ్యవహరించారు. ట్విట్టర్​ను మస్క్ కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని సమాచారం. ట్విట్టర్ డీల్​ను పూర్తి చేశాక.. సీఈఓ పరాగ్ అగర్వాల్ సహా విజయ గద్దెపై వేటు వేశారు మస్క్.

హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​ కథేంటంటే?
తన కుమారుడు హంటర్ బైడెన్​ అవినీతి ఆరోపణలపై ఉక్రెయిన్​లో విచారణ జరగకుండా.. ఉపాధ్యక్ష పదవిలో ఉన్న జో బైడెన్ అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నది ప్రధాన ఆరోపణ. ఈ విషయంలో ఉక్రెయిన్​కు చెందిన ఓ కంపెనీ ప్రతినిధితో జో బైడెన్ భేటీ కూడా అయ్యారని న్యూయార్క్ పోస్ట్ ఓ కథనంలో పేర్కొంది. జో బైడెన్​ను కలిసే అవకాశం ఇప్పించినందుకు సదరు కంపెనీ ప్రతినిధి హంటర్ బైడెన్​కు ఈమెయిల్ రాశారని కథనంలో వివరించింది. ఇందుకు సంబంధించిన మెయిళ్లు హంటర్ బైడెన్ ల్యాప్​టాప్​లో లభ్యమయ్యాయని రాసుకొచ్చింది. దీన్ని డెమొక్రాట్లు ఖండిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details