తెలంగాణ

telangana

ETV Bharat / international

అద్దె చెల్లించని ఎలాన్‌ మస్క్‌.. ట్విట్టర్‌పై దావా.. భవనం ఖాళీ చేయాలని నోటీసులు - అద్దె చెల్లించని ట్విట్టర్‌ సంస్థ

ఇటీవలే ట్విట్టర్‌ను సొంతం చేసుకున్న ఎలాన్‌ మస్క్‌ కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఆయన.. ట్విటర్‌ ప్రధాన కార్యాలయం అద్దెను కొంతకాలంగా చెల్లించడం లేదట. దీంతో భవన యాజమాన్య సంస్థ కోర్టులో దావా వేసింది.

Twitter Elon Musk doesnot pay rent
అద్దె చెల్లించని ఎలాన్‌ మస్క్‌

By

Published : Jan 2, 2023, 6:50 AM IST

Updated : Jan 2, 2023, 11:35 AM IST

ట్విట్టర్‌ కొనుగోలు సమయంలో సంచలన, విమర్శనాత్మక ప్రకటనలతో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఆ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత ఆయనకు కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్‌ ప్రధాన కార్యాలయానికే అద్దె చెల్లించడం లేదట. దీంతో న్యాయపరమైన చర్యలు చేపట్టిన భవన యజమాని సంస్థ.. ట్విట్టర్‌పై దావా వేసినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి.

అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కోలోని హార్ట్‌ఫోర్డ్‌ బిల్డింగ్‌ 30వ అంతస్తులో ట్విటర్‌ ప్రధాన కార్యాలయం కొనసాగుతోంది. అయితే, కొంతకాలంగా ప్రధాన కార్యాలయం అద్దెను ట్విట్టర్‌ చెల్లించడం లేదని తెలుస్తోంది. అందుకే ఐదు రోజుల్లో ఖాళీ చేయాలని డిసెంబర్‌ 16నే ట్విట్టర్‌కు భవన యాజమాన్యం స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరించకపోవడంతో భవన యజమాని శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్‌ కోర్టును ఆశ్రయించారు. ఎలాన్‌ మస్క్‌ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ట్విటర్‌ ప్రధాన కార్యాలయం అద్దెను చెల్లించడం లేదని దావాలో పేర్కొన్నారు. అద్దె కింద మొత్తంగా 1.36లక్షల డాలర్లు బాకీ పడినట్లు సమాచారం. కేవలం ఇదే కాకుండా చాలా ప్రాంతాల్లో ఉన్న ట్విటర్‌ కార్యాలయాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

స్పందించని ట్విట్టర్
కోర్టులో దావాను ఎదుర్కోవడం ట్విట్టర్‌కు కొత్తేమీ కాదు. గతంలోనూ ఛార్టర్‌ విమానాలకు చెల్లింపులు చేయకపోవడంపైనా కోర్టులో దావా కొనసాగింది. తాజాగా ప్రధాన కార్యాలయ అద్దె బాకీ వ్యవహారంపై యజమాన్య సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ స్పందనగా ట్విట్టర్‌ నుంచి మాత్రం ఎటువంటి ప్రకటనా వెలువడలేదు.

Last Updated : Jan 2, 2023, 11:35 AM IST

ABOUT THE AUTHOR

...view details