తప్పుడు సమాచారం, సామాజిక మాధ్యమాలపై రూపొందించిన బిల్లును వ్యతిరేకిస్తూ.. తుర్కియేలో ఓ చట్టసభ సభ్యుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్లమెంట్‌లోనే స్మార్ట్‌ఫోన్‌ను సుత్తితో పగలగొట్టడం గమనార్హం. తుర్కియే ప్రతిపక్ష 'రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ'కి చెందిన ఎంపీ బురాక్ ఎర్బే ఈ చర్యకు పాల్పడ్డారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో తప్పుడు సమాచార వ్యాప్తిని నేరంగా పరిగణించే ఈ కొత్త బిల్లును తుర్కియే చరిత్రలోనే 'అతిపెద్ద సెన్సార్‌షిప్ చట్టం'గా ఆయన అభివర్ణించారు.
'ప్రస్తుతం మీకు ఒకే ఒక్క స్వేచ్ఛ మిగిలి ఉంది. అదే.. మీ చేతిలో ఉన్న స్మార్ట్‌ఫోన్ సాయంతో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర మాధ్యమాల వినియోగం. వాటి సాయంతో ఇతరులతో కమ్యూనికేట్ చేయొచ్చు. కానీ, ఒకవేళ పార్లమెంట్‌లో తప్పుడు సమాచార బిల్లు ఆమోదం పొందితే.. మీ ఫోన్‌లను పగలగొట్టడం మినహా వేరే దారి లేదు! అయితే.. 2023 జూన్‌లో మాత్రం అధికార పక్షానికి గుణపాఠం తప్పదు' అని తుర్కియేవాసులను ఉద్దేశించి ఎర్బే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత.. స్మార్ట్‌ఫోన్‌ను సుత్తితో పగలగొట్టారు.