తెలంగాణ

telangana

ETV Bharat / international

శిథిలాల మధ్య హాహాకారాలు.. తుర్కియే, సిరియాల్లో 15వేలు దాటిన భూకంప మృతులు - సిరియా భూకంపం

భూకంపం ధాటికి కకావికలమైన తుర్కియే, సిరియాల్లో మృతుల సంఖ్య 15 వేలు దాటింది. భవనాల శిథిలాల నుంచి రోజూ బయటపడుతున్న వందల శవాలు హృదయాలను మెలిపెడుతున్నాయి. దశాబ్ద కాలంలో సంభవించిన విపత్తుల్లో ఇంత భారీగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

turkey syria earthquake death toll update
turkey syria earthquake death toll update

By

Published : Feb 9, 2023, 6:40 AM IST

Updated : Feb 9, 2023, 7:44 AM IST

తుర్కియే, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. భవనాల శిథిలాల నుంచి రోజూ బయటపడుతున్న వందల శవాలు హృదయాలను మెలిపెడుతున్నాయి. పలువురు రాళ్లు, రప్పల మధ్య చిక్కుకుని ప్రాణాలుగ్గబట్టుకున్న దయనీయ పరిస్థితులు కంటతడి పెట్టిస్తున్నాయి. బాధితులకు సంఘీభావం తెలిపేందుకు తుర్కియే అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ సహాయ శిబిరాలను సందర్శించారు.

భూకంపం ధాటికి కకావికలమైన తుర్కియే, సిరియాల్లో మృతుల సంఖ్య 15 వేలను దాటింది. గత దశాబ్ద కాలంలో సంభవించిన విపత్తుల్లో ఇంత భారీగా మరణాలు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఒక్క తుర్కియేలోనే 9వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ప్రకటించగా.. సిరియాలో మొత్తంగా 2,600 మంది ప్రకృతి ప్రకోపానికి బలైపోయారు. మొత్తంగా ఇప్పటివరకు దాదాపు 15,000 మంది మృతిచెందారు. మృతుల సంఖ్య 20వేలు దాటే అవకాశం ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసిన విషయం తెలిసిందే.

మరోవైపు, తుర్కియేలో 37,011 మంది, సిరియాలో 2300 మంది క్షతగాత్రులయ్యారు. వేల సంఖ్యలో కుప్పకూలిన భవనాల శిథిలాలను తొలగించే కొలదీ మృతదేహాలు బయటపడుతున్న దృశ్యాలు యావత్‌ ప్రపంచాన్ని కలచివేస్తున్నాయి. శిథిలాల కింద చిక్కుకుని.. ప్రాణాల కోసం పోరాడుతున్న పలువురు చిన్నారుల్ని గుర్తిస్తున్న సహాయక బృందాలు వారిని జాగ్రత్తగా బయటకు తీసి ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. బెసిని నగరంలో 13 ఏళ్ల బాలిక, ఇద్దరు చిన్నారులను తల్లిదండ్రులతో ప్రాణాలతో రక్షించారు. ఇక్కడ మొత్తం 9మందిని కాపాడారు. కహ్రామన్మారస్‌ నగరంలో కుప్పకూలిన అపార్ట్‌మెంట్‌ భవన శిథిలాల నుంచి మూడేళ్ల బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. అదియమాన్‌ నగరంలో 10 ఏళ్ల బాలికను కాపాడారు.

  • దాదాపు 20కి పైగా దేశాల నుంచి వెళ్లిన సహాయక బృందాలు తుర్కియే అత్యవసర బృందాలతో కలిసి సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నాయి. భూకంప ప్రభావిత జోన్‌లో ప్రస్తుతం దాదాపు 60వేల మందికి పైగా సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.
  • మాలత్య నగరంలో పెద్ద ఎత్తున భౌతికకాయాలను ఒకదాని పక్కన ఒకటి పేర్చి.. దుప్పట్లతో కప్పారని మాజీ పాత్రికేయుడు ఓజెల్‌ పికల్‌ వెల్లడించారు. వీరిలో కొందరు మైనస్‌ ఆరు డిగ్రీల చలికి గడ్డకట్టుకుపోయి మరణించి ఉంటారని పేర్కొన్నారు.
  • సిరియాలో కుప్పకూలిన భవన శిథిలాల కింద ఎంతమంది చిక్కుకుపోయారో ఇప్పటికీ తెలియరాలేదు.

కోటి ముప్పై లక్షల మందిపై ప్రభావం
ఈ ఘోర విపత్తుతో అల్లాడుతున్న ప్రాంతాలకు మరింత సహాయం అందించాలంటూ తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్‌ అధికారులను ఆదేశించారు. భూకంప బాధితుల సహాయ శిబిరాలను ఏర్పాటు చేసిన కహ్రామన్మారస్‌లోని టెంట్‌ సిటీని బుధవారం ఆయన సందర్శించి అక్కడి వారికి ధైర్యం చెప్పారు. ఈ భూకంపం తీవ్రతకు దేశంలోని 8.5 కోట్ల మంది జనాభాలో 1.3 కోట్ల మంది ప్రభావితమయ్యారని వెల్లడించారు. ఈ భూ విలయం తీవ్రత అధికంగా ఉన్న 10 ప్రావిన్స్‌ల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 8వేల మందికి పైగా పౌరుల్ని శిథిలాల నుంచి ప్రాణాలతో బయటకు తీసుకొచ్చినట్టు ప్రకటించారు. 3.8 లక్షల మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాలు/వసతి గృహాలకు తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు.

గల్లంతైన భారతీయుడు
తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాల్లో 10 మంది చిక్కుకుపోగా వారందరూ సురక్షితంగా ఉన్నారని.. ఓ వ్యక్తి జాడ మాత్రం తెలియడం లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 'వ్యాపార పనిమీద తుర్కియేకు వెళ్లిన ఓ బెంగళూరు వ్యక్తి ఆచూకీ లభించడం లేదు' అని భారత విదేశాంగ శాఖ(పశ్చిమ) కార్యదర్శి సంజయ్‌ వర్మ పేర్కొన్నారు.

ఆపరేషన్‌ దోస్త్‌ పేరుతో తుర్కియేకు ఇప్పటికే 101 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, శిథిలాలను తొలగించే పరికరాలు, వాహనాలు, డాగ్‌ స్క్వాడ్‌లను పంపించినట్లు విదేశాంగశాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ వెల్లడించారు. బుధవారం మరో 51 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కూడిన మూడో బృందం తుర్కియేకు బయలుదేరింది.

Last Updated : Feb 9, 2023, 7:44 AM IST

ABOUT THE AUTHOR

...view details