వణికించే చలిలో బాధితుల విలవిల.. తుర్కియే, సిరియాల్లో 21వేలు దాటిన మృతుల సంఖ్య - తుర్కియేలో వణికించే చలిలో బాధితుల అవస్థలు న్యూస్
ప్రకృతి విలయ తాండవానికి తుర్కియే, సిరియాల్లో మరణ మృదంగం మోగుతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 21,000 దాటినట్లు తుర్కియే విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అయితే భూకంపం నుంచి ఏదోఒక రకంగా ప్రాణాలతో బయటపడినా ఇప్పుడు చలిని తట్టుకోలేక కన్నుమూసేలా ఉన్నామని బాధితులు కన్నీళ్లతో చెబుతున్నారు.
తుర్కియేలో భూకంపం
By
Published : Feb 10, 2023, 6:58 AM IST
|
Updated : Feb 10, 2023, 11:30 AM IST
కాళ్ల కింద భూమి నిలువునా కదిలిపోయి భవనాలన్నీ కుప్పకూలి వేలమంది ప్రాణాలను బలిగొంటే.. బాధితులుగా మిగిలినవారిని చలి చంపేస్తోంది. తలదాచుకునే చోటు కనిపించక ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ఆహారం, తాగునీరు కోసం వారు ఎదురుచూస్తున్నారు. భూకంపం నుంచి ఏదోఒక రకంగా ప్రాణాలతో బయటపడినా ఇప్పుడు చలిని తట్టుకోలేక కన్నుమూసేలా ఉన్నామని కన్నీళ్లతో చెబుతున్నారు. వెచ్చదనం కోసం పార్కుల్లోని బెంచీలను, పిల్లల దుస్తులను కాల్చేస్తున్నారు.
రంగంలో 1.10 లక్షల బలగాలు పెను విపత్తు తర్వాత సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఆశినంత వేగాన్ని కనపరచడం లేదనే విమర్శలు మొదలయ్యాయి. మే నెలలో జరిగే ఎన్నికల్లో మరోసారి నెగ్గాలని తపిస్తున్న తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్‌కు ఇది ఇబ్బందికర పరిణామమే. హతాయ్ ప్రావిన్సులో ఆయన పర్యటించారు. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 21,051కు పెరిగింది. భూకంపం ధాటికి తుర్కియే ఐదారు మీటర్ల మేర పక్కకు కదిలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సోమవారం రాత్రి భూకంపం సంభవించినప్పటి నుంచి దాదాపు 1,117 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయి. వేలసంఖ్యలో ప్రజలు తాత్కాలిక శిబిరాల్లో, స్టేడియాల్లో తలదాచుకుంటున్నారు. సహాయక చర్యల్లో 1,10,000 మందికి పైగా పాల్గొంటున్నారు. దాదాపు 5 వేల ట్రాక్టర్లు, బుల్డోజర్లు, క్రేన్లు రంగంలోకి దిగాయి.
తుర్కియేలో ఆసుపత్రి నెలకొల్పి సేవలందిస్తున్న భారత సైన్యం
భూకంప బాధిత తుర్కియేలోని హతాయ్ ప్రావిన్సులో భారత సైన్యం తాత్కాలిక ఆసుపత్రిని నెలకొల్పి అత్యవసర వైద్య సేవలందిస్తోంది. శస్త్రచికిత్సలు అవసరమైన వారికి అక్కడే వాటిని పూర్తిచేస్తోంది.తాత్కాలిక ఆసుపత్రిలో ఎక్స్‌రే యంత్రాలు, వెంటిలేటర్లు, ఆపరేషన్ థియేటర్లు కూడా ఉన్నాయి. గాజియాంతెప్ ప్రాంతంలో ఆరేళ్ల పాపను ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు రక్షించాయి. కాంక్రీటు శిథిలాలను పగులగొట్టే యంత్రాలను వినియోగించడంతో పాటు ఎక్కడో ఇరుక్కుని ఉన్నవారి హృదయ స్పందనను గుర్తించగలిగే రాడార్లను కూడా సైనిక బలగాలు వాడుతున్నాయి.
ఉత్తరాఖండ్‌కు చెందిన విజయ్‌కుమార్ గౌడ్ అనే వ్యక్తి అధికారిక విధులపై తుర్కియేకు వెళ్లి గల్లంతవడంతో ఆయన కుటుంబం ఆందోళన చెందుతోంది.