ప్రకృతి విలయ తాండవానికి తుర్కియే, సిరియాల్లో మరణ మృదంగం మోగుతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 19,300 దాటినట్లు తుర్కియే విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. జపాన్లోని ఫుకుషిమా మహా విపత్తును దాటి మరణాల సంఖ్య నమోదైంది. పేకమేడల్లా కూలిన భవనాల కింద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం రెస్క్యూ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. వేలాదిమంది తమ ఇళ్లను కోల్పోవడంతో నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. రాత్రుల్లు గడ్డకట్టే చలిలో బహిరంగ ప్రదేశాల్లోనే తలదాచుకున్నారు. లక్షా పదివేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు విపత్తు నిర్వహణ దళం వెల్లడించింది. 2 డజన్లకుపైగా దేశాలు రెస్క్యూ సిబ్బందిని పంపించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూకంపం ధాటికి దెబ్బతిన్న కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తుర్కియే అధ్యక్షుడు స్పష్టం చేశారు.
గత సోమవారం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఇప్పటివరకు 1,117 సార్లు భూమి కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. వరుస ప్రకంపనలతో బలహీనంగా ఉన్న భవనాలు కూలిపోతున్నాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరగడంతో పాటు సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు చెబుతున్నారు. విమానాశ్రయాలు, కీలక నౌకాశ్రయాలు కూడా దెబ్బతినడం వల్ల ప్రపంచ దేశాల సాయం అక్కడకు చేరడం కష్టతరంగా మారింది. ఒక్కో భవన శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోగా.. వారిని కాపాడేందుకు కనీసం 10 మంది సహాయక సిబ్బంది కూడా అందుబాటులో లేరు. శిథిలాలను తొలగించడానికి సరైన యంత్రాలు లేకపోవడంతో తుర్కియే అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సహాయక చర్యల్లో లోపాలు ఉన్నాయని అంగీకరించిన ఎర్డోగాన్.. ఘోర విపత్తును ముందే ఊహించిన సిద్ధపడటం సాధ్యం కాదన్నారు.