Turkey Suicide Bomber Attack : తుర్కియే రాజధాని అంకారాలోని హోంశాఖ ప్రధాన కార్యాలయం దగ్గర జరిగిన ఆత్మాహుతి దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. ఇదే తరహాలో దాడికి యత్నించిన మరో ముష్కరుడు భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు. వేసవి సెలవుల అనంతరం ఆదివారం పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే కొద్ది గంటలకు ముందే ఈ దాడి జరిగిందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి అలీ యెర్లికాయ వెల్లడించారు. తన కార్యాలయానికి సమీపంలోనే ఈ దాడి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ ఉగ్రదాడిపై దర్యాప్తు జరుగుతోందని ఆ దేశ న్యాయశాఖ మంత్రి యిల్మాజ్ టుంక్ తెలిపారు. ఈ దాడులు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తుర్కియే చేస్తున్న పోరాటానికి ఏ విధంగానూ ఆటంకం కలిగించలేవన్నారు. ఉగ్రవాదంపై తమ పోరాటం మరింత దృఢ సంకల్పంతో కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు వివరించారు.
ఈ దాడి ఎవరు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తుర్కియే మీడియా వర్గాలు తెలిపాయి. అయితే ఇటీవల తరచూ కుర్దిష్ తీవ్రవాదులు, ఇస్లామిక్ స్టేట్ సంస్థ సభ్యులు తుర్కియేలో ఇటువంటి దాడులకు తెగబడుతున్నారు. కాగా, తాజాగా జరిగిన ఘటనకు ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు బాధ్యత వహించలేదు.