తుర్కియే, సిరియాలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. భూకంపం సంభవించి 2 రోజులు దాటినా శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు వెలుగుచూస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 11,000 మందికిపైగా బలయ్యారు. వేలసంఖ్యలో భవనాలు కుప్పకూలిపోవడం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత భూకంపం.. ఈ దశాబ్దంలోనే ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన విపత్తు అని అధికారులు వెల్లడించారు. 20,000 మందికిపైగా మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ-WHO ఇప్పటికే అంచనా వేసింది. ఇప్పటి వరకు మొత్తం 435 సార్లు భూమి తీవ్రంగా కంపించినట్లు తుర్కియే విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఈ విపత్తు ధాటికి వేలాదిమంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయి ఉంటారని యునిసెఫ్ అంచనా వేసింది.
దాదాపు 8.5 కోట్ల జనాభా కలిగిన తుర్కియేలో 1.3 కోట్ల మంది భూకంపం వల్ల తీవ్రంగా ప్రభావితం అయ్యారని ఆ దేశ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ తెలిపారు. ఒక్క తుర్కియేలోనే దాదాపు 7,000 మంది మృత్యువాత పడినట్లు పేర్కొన్నారు. 37,000 మందికి పైగా గాయపడ్డారని వెల్లడించారు. దీంతో 10 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితిని విధించినట్లు ప్రకటించారు. తుర్కియేలో ఇప్పటివరకు 8,000 మందిని శిథిలాల నుంచి రక్షించారు. వేలాది మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. వేల సంఖ్యలో భవనాలు కూలిపోవడం వల్ల 3.80 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వారంతా ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లు, షాపింగ్మాల్లు, మైదానాలు, ఇతర కమ్యూనిటీ కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. తుర్కియేలో 60,000 మంది సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టగా.. ఇంకా చాలా ప్రాంతాల్లో సహాయం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు.
అటు.. సిరియాలో మొత్తం 2,500 పైగా మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో 1,250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2,000 మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న వాయవ్య ప్రాంతంలో 1,280 మందికిపైగా మరణించారని.. 2,600 మందికి పైగా గాయపడ్డారని అక్కడి అధికారులు వెల్లడించారు.
భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. ఒక్క తుర్కియేలోనే 6,000 భవంతులు కూలిపోయాయి. శిథిలాల కింద లక్షా 80వేల మంది చిక్కుకున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరి కోసం గత రెండు రోజులుగా 25,000 మంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినా ఇంకా అనేక మందిని గుర్తించాల్సి ఉంది. శిథిలాల కింద చిక్కుకున్న వారు సజీవంగా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు సహాయక బలగాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే వరుస ప్రకంపనలు, గడ్డకట్టే చలి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయి. దీంతో శిథిలాల కింద మృత్యుంజయులు కన్పించే అవకాశాలు సన్నగిల్లుతుండటం ఆందోళన కలిగిస్తోంది.