Tunnel Collapse In Dominican Republic :సొరంగం సిమెంట్ గోడ కూలి డొమినికన్ రిపబ్లిక్‌లో 9 మంది మృతిచెందారు. ఈ ఘటన శాంటో డోమింగ్ ప్రాంతంలో జరిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా సొరంగం గోడ కూలినట్లు అధికారులు తెలిపారు. వాహనాలు వేగంగా వెళ్లేందుకు నిర్మించిన ఈ సొరంగం గోడ కూలి... ఆ మార్గంలో ప్రయాణిస్తున్న కార్లు, ఇతర వాహనాలపై పడింది. అనేక కార్లు లోపలే చిక్కుకుపోవడం వల్ల అత్యవసర బృందాలు రంగంలోకి దిగాయి. గోడ కూలడం వల్ల లోపల నిర్మించిన పైప్‌లైన్లు పగిలి సొరంగం నీటితో నిండిపోయింది. ఆ నీటి వల్ల సహాయ చర్యలకు విఘాతం కలుగుతోంది. ఇప్పటివరకు 9 మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఐదుగురు పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్లు చెప్పారు.
రోడ్డు నిర్మాణంలో ప్రమాదం.. ఐదుగురు మృతి
Mexico Construction Accident Today : సెంట్రల్ మెక్సికోలో చేపట్టిన రోడ్డు నిర్మాణంలో ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే 50 అడుగుల పొడవైన ఓ భారీ పరికరం కూలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై రిటైనింగ్ గోడ నిర్మాణానికి సిమెంట్ పోస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలంలో ఉన్న మిగిలిన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. ఈ నిర్మాణాన్ని ఓ ప్రైవేట్ సంస్థ చేపట్టిందని.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మెక్సికోలో పని ప్రదేశంలో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.