Trump Praises Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. సవాళ్లను అధిగమిస్తూ అద్భుతమైన పాలన అందిస్తున్నారంటూ కితాబునిచ్చారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తానని రిపబ్లికన్ పార్టీ నేత ధీమా వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. ప్రధాని మోదీతో తన స్నేహం, భారత దేశంతో అనుబంధం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు, తన నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు సహా పలు అంశాలపై మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
'భారత్‌కు నా కన్నా మంచి మిత్రుడైన అమెరికా అధ్యక్షుడు మరొకరు ఉండర'ని ట్రంప్ అభివర్ణించుకున్నారు. మోదీ నేతృత్వంలో భారత్ పురోగమిస్తోందని తెలిపారు. కీలకమైన అధికారిక రహస్య పత్రాలను ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుందన్న వార్తలను ట్రంప్ తోసిపుచ్చారు. ఎఫ్‌బీఐ అధికారులే ఆ పత్రాలను తీసుకొచ్చి పెట్టి నాటకమాడారని ప్రత్యారోపణ చేశారు.