అరుదైన 'ట్రిప్లెట్ పాండాస్'.. జరిగింది పుట్టినరోజు బిందాస్! చైనా గాంగ్జౌ నగరంలోని చిమ్లాంగ్ సఫారి పార్క్లో, మూడు కవల పాండాల ఐదవ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ ముగ్గురిలో మెంగ్ మెంగ్ పెద్దక్క.. షుయాయి, కూకూలు ఆమెకు తమ్ముళ్లు. చైనా సౌత్వెస్ట్ సిచువాన్ ప్రావీన్స్లో పాండా పరిశోధనా-పరిరక్షణ కేంద్రంలో పురుడు పోసుకున్నారు ఈ ముగ్గురు అక్కాతమ్ములు. 2014 జులై 29న జన్మించిన వీరికి ఈ ఏడాది ఐదేళ్లు నిండాయి.
" పాండాలకు అప్పుడే ఐదేళ్లు నిండిపోయాయి.. అంటే వాళ్లు పెద్దవాళ్లయిపోయారు, వారిప్పుడు పూర్తిగా స్వతంత్రులు. వారికిప్పుడు సొంత విల్లా, సొంత రాజ్యం ఉంది"
-చెన్ షుకింగ్, పాండా సంరక్షకురాలు
దేశ వ్యాప్తంగా ముగ్గురు కవలున్న 30 కుటుంబాలను ఆహ్వానించి ఆ మూడు పాండాల పుట్టిన రోజు సంబరాల్లో భాగస్వాములు చేశారు. రకరకాల పళ్లు, కూరగాయాలు, వెదురు బొంగులతో తయారు చేసిన పసందైన కేకులను విందుగా ఆరగించి చూపరులను అలరించాయి పాండాలు.
మెంగ్ మెంగ్ గర్భవతి కూడా. సెప్టెంబర్లో మరో బుజ్జి పాండాకు జన్మనివ్వబోతోంది. జూలో ఉండే ఆడ పాండాల్లో 24 శాతం మాత్రమే నిర్బంధ వాతావరణాన్ని తట్టుకుని గర్భం దాల్చగలవు.
ఒకే సమయంలో ఒక తల్లి కడుపున మూడు పాండాలు పుట్టడం చాలా అరుదు. ప్రపంచ రికార్డుల్లో ఇప్పటివరకు అలాంటివి నాలుగు కవలలు మాత్రమే ఉన్నాయి. అందులోనూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవి ఈ మూడు పాండాలే అని చెప్పాలి. అందుకే ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం!
చైనాలో ప్రస్తుతం 1600లకు పైగా పాండాలు కాగా, 300 పాండాలు జూపార్కుల్లో పెరుగుతున్నాయి.
ఇదీ చూడండి:అద్భుత దృశ్యం: భూమి పొరల నుంచి బూడిద