తెలంగాణ

telangana

ETV Bharat / international

శ్రీలంక అస్తవ్యస్తం.. స్టాక్​ మార్కెట్లు క్రాష్.. విపక్షాలకు అధ్యక్షుడి ఆఫర్!

Srilanka Crisis: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతోంది. సోమవారం స్టాక్​మార్కెట్లు కుప్పకూలడం వల్ల ప్రధాన కంపెనీలు షేర్లను భారీగా నష్టపోయాయి. కాగా, శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స.. దేశంలోని రాజకీయ పార్టీలన్నింటినీ తమ మంత్రి వర్గంలోకి చేరాలని, కలిసికట్టుగా సంక్షోభానికి పరిష్కార దిశగా అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు. బంకుల్లో డీజిల్​ కోసం ప్రజలు గంటల పాటు వేచి చూస్తున్నా లభించడం లేదు.

Trading halted on Sri Lanka
Trading halted on Sri Lanka

By

Published : Apr 4, 2022, 11:21 AM IST

Updated : Apr 4, 2022, 12:59 PM IST

Srilanka Crisis: తినడానికి తిండి లేదు.. వండడానికి గ్యాస్ లేదు. ఇంట్లో ఉందామన్న కరెంట్ లేదు.. వ్యాన్లు నడుపుకుని బతుకుదామంటే డీజిల్​ కూడా లేదు. ఇది శ్రీలంకలో ఉన్న దారుణ పరిస్థితి. అక్కడ బంగారమే కాదు.. పాలపౌడర్‌ ధర కూడా కొండెక్కి కూర్చుంది. కనీసం ఉప్పు కోసం కూడా గంటల కొద్దీ క్యూలో నించోవాల్సి వస్తోంది. అలా గంటల తరబడి వేచి ఉన్నా సరుకులు దొరుకుతాయనే గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండలేక.. చాలా మంది ప్రజలు వలసబాట పడుతున్నారు. అక్కడే ఉన్న వారు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. సంక్షోభ శ్రీలంకలో గంటగంటకూ పరిణామాలు మారిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా అన్ని వ్యవస్థలు కూలిపోతున్నాయి.

బంకుల్లో డీజిల్ ​కోసం పడిగాపులు

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు: ఇప్పటికే ఆహార, చమురు, విద్యుత్‌, విదేశీ ద్రవ్య లభ్యత వంటి కష్టాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న ఆ దేశానికి తాజాగా మరో షాక్‌ తగిలింది. సోమవారం శ్రీలంక స్టాక్‌ మార్కెట్‌ మూతపడింది. కొలంబో స్టాక్‌ మార్కెట్‌ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే ప్రధాన కంపెనీలను ప్రతిబింబించే సూచీలు దాదాపు 6 శాతం నష్టపోయాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు మార్కెట్‌ మరింతగా క్రాష్‌ అవ్వకుండా నిరోధించేందుకు చర్యలు చేపట్టారు. కొలంబో మార్కెట్‌ను మూసేస్తున్నట్టు ప్రకటించారు.

అడుగంటిన డీజిల్​ నిల్వలు: ప్రస్తుతం శ్రీలంకలో డీజిల్​ కోసం బంకుల్లో గంటల తరబడి వేచిచూస్తున్నారు ప్రజలు. అయినా ఎక్కడ దొరకే అవకాశాలు లేవు. దేశమంతా తిరిగినా ఎక్కడ డీజిల్​ దొరక్కట్లేదని వాన్​డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. డీజిల్​ దొరక్క చాలా మంది డ్రైవర్లు తమ వ్యాన్లను పక్కన పెట్టి కూలీలగా మారిపోతున్నారు. కరోనా కారణంగా శ్రీలంకలో నిధులు అడుగంటడం, ఆదాయం లేకపోవడం వల్ల ప్రజలకు చమురు సమకూర్చడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. రోజులు గడిచేకొద్దీ వీటి నిల్వలు తరిగి, ధరలు అమాంతం పెరిగిపోయాయి. పరిస్థితులు కుదుటుపడుతున్న సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగిపోవడం వల్ల మార్చి నెల వచ్చేసరికి రోజువారీ అవసరాలకు కూడా చమురు సమకూర్చుకునే పరిస్థితులు కూడా లేకపోయాయి.

బంకుల్లో డీజిల్ ​కోసం పడిగాపులు
బంక్​లో కార్లు

అన్ని పార్టీల నాయకులు చేరండి: ఈ సంక్షోభాన్ని పరిష్కరించుకోవడానికి శ్రీలంక అధ్యక్షుడు గొటబయా రాజపక్స.. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. అన్ని పార్టీల నాయకులు తమ మంత్రిత్వ శాఖలో చేరాలని కోరారు. తద్వారా సంక్షోభానికి పరిష్కరానికి దిశగా అడుగులు వేద్దామని అన్నారు. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా సోమవారం శ్రీలంక మంత్రివర్గం రాజీనామా చేసింది. ఆ దేశ ప్రధానికి తమ రాజీనామా పత్రాలను మంత్రులు అందించారు. కాగా, తన సోదరుడు, దేశ ఆర్థిక మంత్రి బాసిల్ రాజపక్సను పదవిలో నుంచి తొలగించారు అధ్యక్షుడు గొటబయా. సంక్షోభం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని అధికారులు తెలిపారు.

శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స

ఇదీ చదవండి:శ్రీలంకలో సోషల్ మీడియా బంద్.. ప్రధాని తనయుడి 'వీపీఎన్'​ సెటైర్!

Last Updated : Apr 4, 2022, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details