విదేశీ కానుకల దుర్వినియోగం కేసులో పాక్ మాజీ ప్రధాని తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేయకుండానే పాక్ పోలీసులు వెనుదిరిగారు. దాదాపు 18 గంటల పాటు ఇమ్రాన్ నివాసం ఉన్న లాహోర్‌లోని జమాన్ పార్క్ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. విదేశీ కానుకల కేసులో కోర్టు ఆదేశాల మేరకు ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారు. వారిపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలతోపాటు జల ఫిరంగులు ప్రయోగించారు. రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. అయినా ఇమ్రాన్ మద్దతుదారులు మరింత రెచ్చిపోయారు. పోలీసులకు మద్దతుగా పాక్ ప్రభుత్వం రేంజర్లను పంపింది. ఇమ్రాన్ నివాసానికి పోలీసులు చేరుకోకుండా ఆయన మద్దతుదారులు రోడ్లపై టైర్లు కాల్చటమే కాకుండా వాహనాలకు నిప్పుపెట్టారు.
మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం ఉదయం వరకు జరిగిన ఘర్షణలో 62 మంది గాయపడ్డారు. వారిలో 54 మంది పోలీసులు కాగా.. 8 మంది పౌరులు ఉన్నట్లు జియో న్యూస్ తెలిపింది. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. దాడులకు బాధ్యులైన పీటీఐ కార్యకర్తలను పదులసంఖ్యలో అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్ మద్దతుదారులు రాత్రంతా పోలీసులు, రేంజర్లతో ఘర్షణపడ్డారు. విదేశీ కానుకల కేసులో జారీ అయిన అరెస్ట్ వారెంట్‌ను సవాల్ చేస్తూ పీటీఐ శ్రేణులు మంగళవారం లాహోర్ హైకోర్టును ఆశ్రయించగా.. బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం తీర్పు వాయిదా వేసింది. ఇమ్రాన్ నివాసం వెలుపల గురువారం వరకు పోలీసు ఆపరేషన్ నిలిపివేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పాక్ రేంజర్లు, పోలీసులు వెనుతిరగటం వల్ల పీటీఐ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.