Toshakhana Case Imran Khan : తోషాఖానా అవినీతి కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట దక్కింది. తోషాఖానా కేసులో కింద కోర్టు దోషిగా తేల్చి, విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు సస్పెండ్ చేసింది. తోషాఖానా అవినీతి కేసులో తనకు పడ్డ శిక్షను రద్దు చేయాలంటూ ఇమ్రాన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన హైకోర్టు సోమవారమే తీర్పును రిజర్వ్ చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆమిర్ ఫారూఖ్, జస్టిస్ తారీఖ్ మహ్మద్ జహంగిరిలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పును ప్రకటించింది.
imran khan arrested why : 2018 నుంచి 2022 వరకు ప్రధానిగా ఉన్న సమయంలో ఇమ్రాన్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు విదేశాలు ప్రధానికి ఇచ్చిన కానుకలను అక్రమంగా అమ్మేసుకున్నారని.. కేసు నమోదైంది. ఈ కేసులో ఇస్లామాబాద్‌లోని జిల్లా, సెషన్స్ కోర్టు ఆగస్టు 5న ఇమ్రాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించింది. అంతేకాకుండా ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. తీర్పు వెలువడిన వెంటనే అరెస్టయిన ఇమ్రాన్.. ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లోని అటక్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలోనే ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేయగా.. ఇస్లామాబాద్ హైకోర్టు దాన్ని నిలిపేసింది.
Toshakhana Case In Pakistan : గతేడాది ఏప్రిల్‌లో అవిశ్వాస తీర్మానం కారణంగా ఇమ్రాన్ ఖాన్‌ప్రధాని పదవి నుంచి దిగిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన్ను కేసులు చుట్టుముట్టాయి. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు.. ఆయనకు విదేశీ పర్యటనల్లో పలు కానుకలు వచ్చాయి. వాటిని ఇమ్రాన్ విక్రయించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌పై కేసు నమోదైంది. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్న సమయంలో దాదాపు 58 ఖరీదైన కానుకలు అందుకున్నారు. వాస్తవానికి వీటిని తోషాఖానాలో జమ చేయాలి. ఇక వాటిని సొంతం చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం సగం ధర చెల్లించి తీసుకోవాలి.