Tomatoes guinness records: టమాట చెట్టుకు ఒకేసారి ఎన్ని కాయలు కాస్తాయి? 20..30..50? బ్రిటన్‌లోని హెర్ట్ఫర్డ్షైర్కు చెందిన డగ్లస్ స్మిత్ మాత్రం 1,269కి తగ్గేదే లేదంటున్నాడు. అందుకే గిన్నిస్ రికార్డుల్లోకీ ఎక్కాడు అతడు. ఇంటి పెరట్లోని చెట్టుకే డగ్లస్ ఇన్ని టమాటాలు కాసేలా చేసి, ఈ ఘనత సాధించడం విశేషం.
ఒకే కొమ్మకు 1,269 టమాటాలు- పదేళ్ల గిన్నిస్ రికార్డ్ బ్రేక్ పదేళ్ల రికార్డ్ బ్రేక్: డగ్లస్ స్మిత్.. ఓ హార్టికల్చరిస్ట్. హెర్ట్ఫర్డ్షైర్లోని తన ఇంటి వెనుక ఉన్న చిన్నపాటి తోటలోనే రకరకాల మొక్కలు పెంచుతాడు. వాటిపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటాడు. అలాంటి డగ్లస్‌కు.. టమాటాల సాగుకు సంబంధించి గిన్నిస్ బుక్‌లోని ఓ రికార్డ్ గురించి తెలిసింది. ఒకే కొమ్మకు 488 టమాటాలు కాశాయని, గత పదేళ్లుగా ఆ రికార్డ్ అలానే చెక్కుచెదరకుండా ఉందని అర్థమైంది. ఈ రికార్డ్‌ను మనమెందుకు తిరగరాయకూడదు అనుకున్నాడు డగ్లస్.
Douglas Smith tomato: టమాటాల రికార్డ్ బ్రేక్ చేసేందుకు పెద్ద కసరత్తే చేశాడు డగ్లస్. ఎన్నో పుస్తకాలు, పరిశోధనా పత్రాలు చదివాడు. తన పెరట్లోని మట్టిని ఎప్పటికప్పుడు ప్రయోగశాలలో పరీక్షించి, దాని గుణగణాల్ని తెలుసుకున్నాడు. ఇలా రోజులో నాలుగు గంటలపాటు పెరటి తోటలోనే గడిపాడు. డగ్లస్ శ్రమ ఫలించింది. గతేడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో అతడి ఇంట్లోని టమాట చెట్టు కొమ్మకు ఒకేసారి 839 కాయలు కాశాయి. పదేళ్ల గిన్నిస్ రికార్డ్ బ్రేక్ అయింది. అయినా అంతటితో ఆగలేదు డగ్లస్. తన ప్రయోగాల్ని మరికొన్ని వారాలపాటు అలానే కొనసాగించాడు.
839 టమాటాలు కాసిన చెట్టు వద్ద డగ్లస్ 2021 సెప్టెంబర్ వేసవి నాటికి డగ్లస్ 'పంట' పండింది. గిన్నిస్ బుక్ ప్రతినిధులు వచ్చారు. టమాటాలు కోసి, లెక్క పెట్టారు. మొత్తం 1,269గా లెక్క తేలింది. సరికొత్త గిన్నిస్ రికార్డ్ నమోదైంది. ఇలాంటి ఘనతలు డగ్లస్‌కు కొత్త కాదు. 2020లో 20 అడుగులు ఎత్తయిన పొద్దు తిరుగుడు చెట్టును పెంచాడు. 3.106 కిలోల టమాట పండించి... బ్రిటన్‌లో అత్యంత బరువైన టమాటాగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం బటానీలు, బంగాళాదుంపలు, వంకాయలపై ప్రయోగం చేస్తున్నాడు డగ్లస్ స్మిత్.
టమాటాలు కోసి, పెట్టెల్లో సర్దుతూ... డగ్లస్ చెట్టుకు కాసిన టమాటాలు