Titanic Submarine Missing : అట్లాంటిక్ మహా సముద్రంలో గల్లంతైన ఓ మినీ జలాంతర్గామి గాలింపు చర్యల్లో కీలక ముందడుగు పడింది. కెనడాకు చెందిన పెట్రోలింగ్ విమానం పీ-3.. నీటి అడుగున శబ్దాలను గుర్తించిందని అమెరికా కోస్ట్‌గార్డ్ తెలిపింది. విమానంలోని సోనార్ వ్యవస్థ శబ్దాలు గుర్తించిన నేపథ్యంలో అధికారులు గాలింపు చర్యలను రీలొకేట్ చేశారు. గురువారం తెల్లవారుజాము నాటికి మాత్రమే జలాంతర్గామిలో సరిపడా ఆక్సిజన్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రక్షక దళాలు విరామం లేకుండా జలాంతర్గామి కోసం గాలిస్తున్నాయి.
అసలేం జరిగిందంటే..
8 రోజుల సాహస యాత్రలో భాగంగా టైటానిక్ శకలాలను చూసేందుకు బిలియనీర్లు హమీష్ హార్డింగ్, బ్రిటిష్- పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్(48), ఆయన కుమారుడు సులేమాన్(19)తో పాటు మరో ఇద్దరు సముద్ర గర్భానికి వెళ్లారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సాగరంలో ప్రవేశించిన గంటా 45 నిమిషాల్లోనే సబ్‌మెరైన్‌తో సంబంధాలు తెగిపోయాయి. దాన్ని గాలించేందుకు అమెరికా, కెనడాలు పెట్రోలింగ్ విమానాలు, నౌకలను రంగంలోకి దించాయి. మునిగిన ఆ జలాంతర్గామిలో మొత్తం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉంది. 10,432 కిలోల బరువున్న జలాంతర్గామి 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు.
క్షేమంగా తిరిగి రావాలి..
బ్రిటిష్-పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్ ప్రమాదం నుంచి బయటపడాలని ఆయన శ్రేయాభిలాషులు, స్నేహితులు ప్రార్థించారు. షాజాదా.. పాక్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఇంగ్రో కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్. ఆ సంస్థ.. పాకిస్థాన్‌లో ఎరువులు, వాహన, ఇంధన, డిజిటల్ టెక్నాలజీలో భారీగా పెట్టుబడులు పెట్టింది.