Thailand prime minister suspended: థాయ్లాండ్ రాజ్యాంగ కోర్టు బుధవారం కీలక ఆదేశాలు వెలువరించింది. ప్రధానమంత్రి ప్రయూత్ చాన్-వో-చాను పదవి బాధ్యతల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధానమంత్రి ప్రయూత్ తన పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగుతున్నారంటూ ప్రతిపక్షాలు పిటిషన్ను దాఖలు చేశాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం.. వారి వాదనతో ఏకీభవించింది. కానీ పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారా? లేదా అనే ఆంశంపై ఎలాంటి స్పష్టత వచ్చే వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ వ్యవహారంపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రయూత్ను ఆదేశించింది. కాగా ప్రస్తుతం ఆయన చేపడుతున్న రక్షణ శాఖను కొనసాగింపుపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. తాత్కాలిక ప్రధాని ఎవరు అనేది నిర్ణయించలేదు. రాజ్యాంగం ప్రకారం ఉపప్రధానమంత్రి ప్రవిత్ వాంగ్సువన్ ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ప్రయూత్ నాయకత్వంలోని సైనిక కూటమి 2014 మేలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే మంగళవారం నాటికే ప్రయూత్ పదవీ కాలం ముగిసిందని.. అయినా పదవిలో కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రయూత్ మద్దతుదారులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నారు. సవరించిన రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి పదవీ కాలం 8 సంవత్సరాలని.. దీని ప్రకారం ఇది అమల్లోకి వచ్చిన 2017 ఏప్రిల్ 6 నుంచి వర్తిస్తుందని చెపుతున్నారు. మరోవైపు కొత్త రాజ్యాగం ప్రకారం 2019 జూన్ 9న ప్రయుత్ బాధ్యతలు చేపట్టినందున.. నాటి నుంచే పదవీ కాలం మొదలవుతుందని కొందరు వాదిస్తున్నారు.