Thailand Bomb Blast Today : సెంట్రల్ థాయిలాండ్‌లోని బాణసంచా పరిశ్రమలో పేలుడు సంభవించి సుమారు 23 మంది మరణించారు. రాజధాని బ్యాంకాక్‌కు వాయువ్య దిశలో 90 కి.మీల దూరంలోని సుఫాన్ బురీ ప్రావిన్సులో ఈ పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. కాగా, ఘటన జరిగిన సమయంలో 20 నుంచి 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు ఓ అధికారి చెప్పారు. అయితే ఫిబ్రవరిలో జరిగే చైనా నూతన ఏడాదిని పురస్కరించుకొనే డిమాండ్‌కు అనుగుణంగా ఇక్కడ పెద్ద ఎత్తున బాణసంచా తయారీ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది నవంబర్లోనూ జరిగిన బాంబు పేలుడులో ఒక కార్మికుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారు.
నైజీరియాలో భారీ పేలుడు-ముగ్గురి మృతి
Nigeria Bomb Blast : మరోవైపు ఆఫ్రికా దేశం నైజీరియాలోనూ బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో 77 మంది గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
10 మంది మృతి
ఇక గతేడాది జులైలో కూడా థాయిలాండ్‌లోనే ఓ బాణసంచా గోదాములో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికిపైగా గాయపడ్డారు. నరాతీవత్ ప్రావిన్సులో జరిగిన ఈ పేలుడులో ఫ్యాక్టరీకి సుమారు 500 మీటర్ల పరిధిలో ఉన్న 100 వరకు ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. గోదాములో జరుగుతున్న నిర్మాణ పనుల్లో భాగంగా జరిపిన మెటల్ వెల్డింగ్ నుంచి వచ్చిన నిప్పురవ్వలతో లోపల నిల్వ ఉంచిన బాణసంచాకు మంటలు అంటుకుని పేలుడు సంభవించి ఉంటుందని నరాతీవత్ గవర్నర్ తెలిపారు.