తెలంగాణ

telangana

ETV Bharat / international

చనిపోయినట్టు నటించి.. ప్రాణాలతో బయటపడ్డ బాలిక - Texas shooting girl news

Texas Shooting Incident: టెక్సాస్ కాల్పుల ఘటనలో సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రాణాలతో బయటపడింది 11 ఏళ్ల బాలిక. ఒంటికి రక్తం పూసుకుని చనిపోయినట్టు నటించింది.

Texas shooting
టెక్సాస్​ ఘటన

By

Published : May 28, 2022, 6:52 AM IST

Texas Shooting: ఒక్కొక్కర్నీ తుపాకీతో కాల్చుకుంటూ వస్తున్న వ్యక్తి కళ్లెదుటే ఉండి... తర్వాత మనల్ని కూడా కాల్చేస్తాడని తెలిసినప్పుడు ఏమనిపిస్తుంది! అసంకల్పితంగానే గట్టిగా అరవడమో, 'వద్దు వద్దు.. ప్లీజ్‌.. కాల్చొద్దు' అని ప్రాధేయపడటమో జరుగుతుంది. టెక్సాస్‌ పాఠశాలలో మంగళవారం దుండగుడు కాల్పులు జరుపుతున్నప్పుడు మాత్రం... 11 ఏళ్ల బాలిక సమయస్ఫూర్తితో వ్యవహరించి తన ప్రాణాలు దక్కించుకుంది. పక్కన రక్తపు మడుగులో పడి ఉన్న స్నేహితురాలి నెత్తుటిని ఒంటికి అద్దుకుని, తాను కూడా చనిపోయినట్టు నటించింది!

ఏం జరిగిందంటే..: 11 ఏళ్ల మియా సెరిల్లో... యువాల్టీ నగరంలోని రాబ్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోంది. ఎప్పట్లాగే మంగళవారం స్నేహితులతో కలిసి సరదాగా బడికి వెళ్లింది. తరగతి గదిలో ఉండగా... సాల్వడార్‌ రామోస్‌ అనే 18 ఏళ్ల యువకుడు తుపాకీతో వచ్చి టీచర్‌ను, కొంతమంది విద్యార్థులను కాల్చి పారేశాడు. తనను కూడా కాల్చి చంపేస్తాడని భావించిన మియా... పక్కనే రక్తపు మడుగులో పడి ఉన్న స్నేహితురాలి నెత్తుటిని ఒంటికి అద్దుకుని, కింద కూలబడి, చనిపోయినట్టు నటించింది! దుండగుడు వెళ్లిపోయిన వెంటనే... అప్పటికే మృతిచెందిన టీచర్‌ చేతిలోని ఫోన్‌ తీసుకుని 911 నంబరుకు కాల్‌ చేసింది.

కాల్పుల సంగతి తెలియగానే మియా తండ్రి మిగుల్‌ సెరిల్లో పరుగుపరుగున పాఠశాలకు చేరుకున్నారు. వచ్చీ రావడంతోనే... రక్తపు మరకలతో ఉన్న కుమార్తెను పోలీసులు బయటకు తీసుకొస్తుండటం చూసేసరికి ఆయనకు గుండె ఆగినంత పనైంది! పరుగున వెళ్లి కుమార్తెను దగ్గర తీసుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని ఆమెను స్కూలు బస్సులో ఎక్కించారు. దీంతో మిగుల్‌ బస్సు కిటికీ వద్దకు వచ్చి కుమార్తెతో మాట్లాడాడు. చిన్నారి చేసిన పని తెలుసుకుని నిర్ఘాంతపోయాడు. దుండగుడు కాల్పులు జరిపినప్పుడు తూటాల శకలాలు గుచ్చుకోవడం వల్ల మియా స్వల్పంగా గాయపడింది. దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స అందించారు. అదేరోజు సాయంత్రం ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదే బడిలో చదువుతున్న మియా చెల్లి కూడా ప్రాణాలతో బయటపడటం వల్ల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:మీనమేషాలు లెక్కించారు! గంటసేపు మారణహోమం జరిగినా కదలని పోలీసులు!!

ABOUT THE AUTHOR

...view details