Texas School Shooting: ముక్కూమొహం తెలియని వ్యక్తి ఒక పాఠశాలలోకి ఆయుధాలతో చొరబడడమేమిటి? దాదాపు గంటసేపు ఆ వ్యక్తి హల్‌చల్ చేస్తుంటే, మారణహోమానికి తెగబడుతుంటే పోలీసులు అక్కడకు చేరుకుని కూడా నిలువరించకపోవడం ఏమిటి?.. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం యువాల్డీ పట్టణంలోని రాబ్ ప్రాథమిక పాఠశాలలో కాల్పుల ఘటన తర్వాత ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి. 19 మంది చిన్నారుల్ని, ఇద్దరు ఉపాధ్యాయుల్ని పొట్టనపెట్టుకున్న కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా అనేకమందిని తీవ్రంగా కదిలిస్తోంది. అమెరికాలో వరసగా కాల్పుల ఘటనలు జరుగుతున్నా పాఠశాల వద్ద కనీస తనిఖీలు లేకపోవడం ఒక ఎత్తు అయితే, పోలీసుల స్పందన అత్యంత పేలవంగా ఉండడం మరో ఎత్తు. కాల్పుల విషయం తెలిసిన తర్వాత పాఠశాల వద్దకు పరుగు పరుగున చేరుకున్న తల్లిదండ్రులు అక్కడున్న పోలీసుల వద్దకు చేరుకుని ఎంతగా ప్రాధేయపడినా వారిలో ఎవరూ లోపలకు వెళ్లి, ముష్కరుడు సాల్వడార్ రామోస్‌ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ప్రత్యక్ష సాక్షుల మాటలద్వారా బయటపడింది.
లోపలకు వెళ్లాలనుకున్న తల్లిదండ్రులు:"కాల్పులు జరుగుతున్నప్పుడు మా ఇంటి వెలుపల నుంచి అంతా కనిపించింది. లోపలకు వెళ్లాల్సిందిగా పోలీసులకు కొంతమంది తల్లులు గట్టిగా అరిచి చెప్పారు. 40 నిమిషాల నుంచి గంటసేపు అయిన తర్వాతే ముష్కరుడిని మట్టుబెట్టారు" అని ఆ పాఠశాల చెంతనే నివాసం ఉండే మహిళ ఒకరు చెప్పారు. చేష్టలుడిగిన పోలీసులతో ఒకదశలో తల్లిదండ్రులు విసిగిపోయి, పిల్లల ప్రాణాలు కాపాడేందుకు తమంత తాముగా పాఠశాల లోపలకు వెళ్లాలనుకున్నారని మరో ప్రత్యక్షసాక్షి తెలిపారు. పోలీసులు ఏమాత్రం సన్నద్ధత లేకుండా వచ్చారని జేవియర్ కేజరెస్ చెప్పారు. ఆయన కుమారుడు కూడా ప్రాణాలు కోల్పోయినవారిలో ఉన్నాడు.
కుట్ర కోణం ఉందా?:టెక్సాస్ పాఠశాల కాల్పుల్లో కుట్ర కోణమేదైనా ఉందా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. పిల్లలపై మృత్యుపంజా విసిరిన రామోస్ ట్రాన్స్‌జెండర్ అనీ, అక్రమంగా వలస వచ్చి అమెరికాలో ఉంటున్నాడని సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది. ఈ మొత్తం ఘటన ఓ కుట్ర అనేదీ ప్రచారంలో ఉంది. జాతి విద్వేషం, అసహనం, ట్రాన్స్‌జెండర్లపై వివక్ష వంటివీ కారణాలు కావచ్చని చెబుతున్నారు. తుపాకీ హింస గురించి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని 'డిస్ ఇన్ఫో డిఫెన్స్‌లీగ్' పరిశోధన విభాగ డైరెక్టర్ లొంగోరియా అభిప్రాయపడ్డారు.
ఒక్కరోజు గడిచి ఉంటే..:నిజానికి వేసవి సెలవులు ప్రారంభం కావడానికి ముందు రోజు కావడం వల్ల మంగళవారం పిల్లలంతా ఉత్సాహభరిత వాతావరణంలో ఉండాల్సి ఉండగా అనూహ్య రీతిలో విషాదం అలముకుంది. పిల్లల అంత్యక్రియల దృశ్యాలతో యువాల్డీలో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. ఒక్కరోజు గడిచి ఉంటే పిల్లలంతా సెలవుల్లో ఇళ్లలోనే ఉండేవారని తల్లిదండ్రులు కన్నీళ్లతో చెబుతున్నారు. స్నేహితురాలిని రక్షించే ప్రయత్నంలో తన కుమార్తె అమెరీ కూడా తూటాలకు బలైపోయిందని మరొకరు వెల్లడించారు. పిల్లల్ని కాపాడాలని తపనపడ్డ ఇద్దరు టీచర్లు కూడా తూటాలకు నేలకొరగడం అందరినీ కలచివేస్తోంది.