ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు మెల్లగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు క్షిపణి పరీక్షలతో కొరియా ద్వీపకల్పం హోరెత్తగా.. తాజాగా యుద్ధవిమానాల జోరు పెరిగింది. శుక్రవారం ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ గగనతలంలో ఏకంగా 180 యుద్ధవిమానాలను మోహరించినట్లు దక్షిణ కొరియా గుర్తించింది. అంతేకాదు మిలటరీ డిమార్కేషన్ లైన్‌కు 12 మైళ్ల దూరంలోకి కొన్ని యుద్ధవిమానాలను పంపింది. దీంతో దక్షిణ కొరియా కూడా అత్యవసరంగా 80 యుద్ధ విమానాలను గగనతల రక్షణకు తరలించింది. వీటిల్లో అత్యాధునిక ఎఫ్-35ఏ మోడల్ విమానాలు కూడా ఉన్నాయి. ఓ పక్క అమెరికాతో కలిసి విజిలెంట్ స్ట్రామ్ పేరిట సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకొంది.
నార్త్ X సౌత్.. 180 యుద్ధ విమానాలు పంపిన కిమ్.. దక్షిణ కొరియా స్ట్రాంగ్ రిప్లై
కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరిగాయి. నిన్నటి వరకు క్షిపణి పరీక్షలతో ఈ ప్రాంతం హోరెత్తగా తాజాగా యుద్ధవిమానాల జోరు పెరిగింది. ఓ పక్క అమెరికాతో కలిసి విజిలెంట్ స్ట్రామ్ పేరిట సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్న సమయంలోనే.. గగనతలంలో యుద్ధవిమానాలు చక్కర్లు కొడుతుండటం ఆందోళనకు దారితీస్తోంది.
గత నెలలో కూడా 10 యుద్ధ విమానాలను దక్షిణ కొరియా సరిహద్దుల సమీపంలోకి ప్యాంగ్‌యాంగ్ పంపింది. నిన్న రాత్రి దాదాపు 80శతఘ్ని గుండ్లను ఉత్తరకొరియా పేల్చింది. ఇది 2018లో చేసుకొన్న ఒప్పందానికి విరుద్ధమని దక్షిణ కొరియా పేర్కొంది. గురువారం ఏకంగా ఓ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) సహా ఆరు మిస్సైళ్లను ప్రయోగించింది. తమ తూర్పు జలాల మీదుగా ఈ ప్రయోగాలు జరిగినట్లు సమాచారం.
ఉత్తర కొరియా ఖండాంతర క్షిపణి ప్రయోగ సమాచారంతో ప్రజలంతా సురక్షితమైన భవనాలు లేదా భూగర్భ ప్రాంతాల్లో తలదాచుకోవాలంటూ జపాన్ ప్రధానమంత్రి కార్యాలయం(వోజేపీఎం) ఉత్తర ప్రాంతంలోని మియాగి, యమగట, నియాగటలోని ప్రజలకు టీవీలు, రేడియోలు, మొబైల్ ఫోన్లు, పబ్లిక్ లౌడ్ స్పీకర్ల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో బుల్లెట్ ట్రైన్ సేవలను తాత్కాలికంగా నిలిపేశారు. బుధవారం, గురువారం కలిపి మొత్తం 30క్షిపణులను ఉ.కొరియా ప్రయోగించింది. వీటిల్లో ఒకటి దక్షిణ కొరియా ప్రాదేశిక జలాల్లో పడింది. 1953లో కొరియా యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారి ఇటువంటి ఘటన చోటు చేసుకొంది.