us warship taiwan strait: తైవాన్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. తైవాన్, చైనాను వేరు చేసే తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు పయనించాయి. తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ పర్యటించిన తర్వాత ఈ తరహా ఆపరేషన్‌ను మొదటిసారి అమెరికా చేపట్టింది. పెలోసీ పర్యటన సందర్భంగా చైనా పెద్ద ఎత్తున తైవాన్ జలసంధిలో యుద్ధ విన్యాసాలను నిర్వహించగా ఇప్పుడు ఆ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు పయనించాయి. అమెరికా యుద్ధ నౌకల కదలికలను చైనా నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఎలాంటి రెచ్చగొట్టే చర్యలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు చైనా సైన్యం తెలిపింది. తైవాన్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకల పయనంపై బీజింగ్ విమర్శలు గుప్పించింది. తైవాన్ యంత్రాంగాన్ని బుజ్జగించేందుకు అమెరికా ఇలాంటి పనులు చేస్తోందని విమర్శించింది.
2012 నుంచి వందకు పైగా అమెరికా యుద్ధ నౌకలు తైవాన్ జలసంధి గుండా పయనించాయి. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చాలా భాగం తమదేనని చైనా వాదిస్తుండగా.. అక్కడ స్వేచ్ఛాయుత నావిగేషన్ కోసం అమెరికా ఇలా యుద్ధ నౌకలు, విమానాలను పంపుతోంది. తైవాన్‌లో పెలోసీ పర్యటన తర్వాత కొన్ని రోజుల పాటు తైవాన్ జలసంధిలో చైనా యుద్ధ విన్యాసాలు చేపట్టింది. ఇందులో భాగంగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. వాటిని కొన్ని జపాన్ సముద్ర జలాల్లో పడ్డాయి. ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధ నౌకల పయనంతో తైవాన్ జలసంధిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.