24 ఏళ్ల సర్వీసులో 20 సంవత్సరాల కాలం పాటు విధులకు డుమ్మా కొట్టింది ఓ టీచర్. వివిధ కారణాలు చెబుతూ చిటికీమాటికీ పాఠశాలకు సెలవులు పెట్టేది. విధులకు హాజరుకాకున్నా జీతం మాత్రం ఎంచక్కా తీసుకునేది. పంతులమ్మ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు.. ఆమెకు వ్యతిరేకంగా ఆందోళన దిగారు. దీంతో టీచర్‌పై విచారణ చేపట్టిన అధికారులు... ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ వ్యవహరమంతా ఇటీవలే ఇటలీలో వెలుగులోకి వచ్చింది. దేశంలోనే చెత్త టీచర్‌గా ఆమెను పిలుస్తున్నారు.
సింజియా పావోలినా డే లియో (54) అనే టీచర్.. ఇటలీలోని వెనిస్ ప్రావిన్సులోని వెరోనీస్ హైస్కూల్‌లో విధులు నిర్వర్తిస్తోంది. విద్యార్థులకు సాహిత్యం, తత్వశాస్త్రం పాఠాలను బోధించేది. ఎక్కువగా అనారోగ్య సెలవులు, హాలీడేల పేరుతో సెలవులు పెట్టేది. కాన్ఫరెన్సులు ఉన్నాయనే సాకుతోనూ పాఠశాలకు రావడం మానేసింది. తన 24ఏళ్ల సర్వీసులో ఇప్పటివరకు కేవలం నాలుగేళ్లు మాత్రమే విధులకు హాజరయ్యింది.
విధులకు వచ్చినా సరిగ్గా బోధించేది కాదని.. అసలు పాఠ్యపుస్తకాలు తెచ్చుకోవడమే మర్చిపోయేదని విద్యార్థులు చెబుతున్నారు. పరీక్షలప్పుడు కూడా ఫోన్లో మెసేజీలతో బిజీగా గడిపేదని వెల్లడిస్తున్నారు. టీచర్‌ను ప్రశ్నించిన విద్యార్థులకు ఏదో ఒక గ్రేడ్ వేసేదట. ఇలా ఆ పంతులమ్మ తీరుతో విసిగిపోయిన విద్యార్థులు.. ఆందోళన బాటపట్టారు. దీంతో పాఠశాల పాలనా విభాగం విద్యాశాఖకు ఆ టీచర్‌పై ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల విచారణలో పంతులమ్మ నిర్వాకం బయటపడింది. దీంతో ఆమె ఉద్యోగం ఊడింది.