నేపాల్‌కు చెందిన తారా ఎయిర్‌లైన్స్ 9 ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం ఆచూకీ గల్లంతైంది. విమానంలో ముగ్గురు సిబ్బందితో పాటు 19 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పఖోరా నగరం నుంచి కొండ ప్రాంత పట్టణం జోమ్సోమ్కు 15 నిమిషాల ప్రయాణం కోసం గాల్లోకి ఎగిరిన కాసేపటికే.. ఉదయం 9.55 గంటల ప్రాంతంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయన్నారు.
22 మందితో వెళ్తూ విమానం మిస్సింగ్.. పావు గంట ప్రయాణం కోసం ఎక్కితే... - విమానం ఆచూకీ గల్లంతు
11:01 May 29
22 మందితో వెళ్తున్న విమానం ఆచూకీ గల్లంతు
"ట్విన్ ఇంజిన్ ఎయిర్‌క్రాఫ్ట్ విమానం ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలు చేపట్టాం. కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. కానీ, విమానాలు సాధారణంగానే తిరుగుతున్నాయి. కొండలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రాంతానికి విదేశీ ట్రెక్కర్లు ఎక్కువగా వస్తుంటారు. అలాగే.. ముక్తినాథ్ ఆలయాన్ని సందర్శించేందుకు భారత్, నేపాలీ భక్తులు పర్యటిస్తారు."
- రమేశ్ తాపా, పోలీసు అధికారి.
19 మంది ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ దేశస్థులు ఉన్నారు. మిగిలినవారు నేపాలీలు. సిబ్బందితో కలిపి విమానంలో మొత్తం 22 మంది ఉన్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఆచూకీ గల్లంతైన విమానాన్ని వెతికేందుకు రెండు హెలికాప్టర్లను రంగంలోకి దింపింది నేపాల్ హోంశాఖ. ముస్టాంగ్, పోఖరా నుంచి ఇవి గాలింపు చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపింది. మరోవైపు.. నేపాల్ ఆర్మీ చాపర్ ఎంఐ-17 సైతం మోహరించినట్లు తెలిపారు హోంశాఖ ప్రతినిధి ఫదింద్ర మని. సంబంధాలు తెగిపోయిన ముస్టాంగ్లోని లేటే ప్రాంతంలో గాలిస్తున్నట్లు తెలిపారు.