Taliban bars govt employees: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. బాలికా విద్యను నిషేధించిన తాలిబన్లు.. అమ్మాయిలపై మళ్లీ కఠిన ఆంక్షలు తీసుకొచ్చారు. తాజాగా పురుషులకు కూడా కొన్ని నిబంధనలు తప్పనిసరి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి కచ్చితంగా గడ్డం ఉండాల్సిందేనని, లేదంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
తాలిబన్ ప్రభుత్వంలోని పబ్లిక్ మోరాలిటీ మంత్రిత్వశాఖకు చెందిన కొందరు ప్రతినిధులు సోమవారం కాబుల్ సహా పలు నగరాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఉద్యోగులు తప్పనిసరిగా డ్రెస్‌కోడ్ అనుసరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు గడ్డం షేవ్ చేసుకోవద్దని, సంప్రదాయ వస్త్రధారణ మాత్రమే ధరించాలని, తలకి టోపీ పెట్టుకోవాలని ఆదేశించారు. డ్రెస్ కోడ్ పాటించకపోతే ఆ ఉద్యోగులను ఆఫీసుల్లోకి రానివద్దని కార్యాలయాలకు సూచించారు. అవసరమైతే ఉద్యోగం నుంచి కూడా తొలగిస్తామని హెచ్చరించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి.