Taliban Govt Ban Beauty Parlours : అఫ్గానిస్థాన్‌లో మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం విధించింది అక్కడి తాలిబన్ ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మహిళల హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం పట్ల దేశ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం లీడర్ హిబాతుల్లా అఖుంజాదా జారీ చేసిన జూన్ 24 నాటి ఉత్తర్వులను.. తాలిబన్ మంత్రి సిద్దిఖ్ అకిఫ్ మజహర్ ధ్రువీకరించారు. అఫ్గానిస్థాన్ప్రభుత్వం.. మహిళలను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కొద్ది రోజుల కిందట అఖుంజాద పేర్కొన్నారు. ఆ ప్రకటన విడుదలైన కొద్ది రోజులకే ఈ నిషేధం అమలుకానుంది. కాగా అక్కడ ఇప్పటికే పార్కుల్లో, జిమ్ల్లోకి మహిళలు వెళ్లకుండా ఆంక్షలు ఉన్నాయి.
నెల రోజులు డెడ్‌లైన్..
అఫ్గాన్ రాజధాని నగరం కాబుల్ సహా అన్ని ప్రాంతాల్లో సెలూన్లను మూసివేయడానికి ఒక నెల గడువు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నెల గడువు తర్వాత కచ్చితంగా సెలూన్లను మూసివేసి.. సంబంధిత నివేదిక ప్రభుత్వానికి సమర్పించాలని హెచ్చరించింది. కానీ బ్యాన్‌కు గల కారణాలను ప్రభుత్వం వెల్లడించలేదు.
తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇలాంటి పరిమితులు మహిళల హక్కులు హరించడమే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతాయని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంపై స్థానిక మహిళలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.