Sweden Nato Membership : స్వీడన్‌కు అత్యంత కీలకమైన నాటో కూటమిలో సభ్యత్వం దక్కింది. 32వ దేశంగా స్వీడన్.. కూటమిలో చేరనుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తటస్థంగా ఉన్న స్వీడన్.. ఇప్పుడు రష్యా వ్యతిరేక బృందంలో ఆడుగుపెట్టనుంది. మరోవైపు నాటోలో చేరడానికి ఉవ్విళ్లూరుతున్న ఉక్రెయిన్‌కు నిరాశే మిగిలింది. ఆ దేశాన్ని కూటమిలో చేర్చుకుంటామని.. కానీ ఎప్పుడో అన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు సభ్య దేశాలు. "ఉక్రెయిన్ కచ్చితంగా నాటోలో సభ్యత్వం పొందుతుంది. అందుకోసం కొన్ని విషయాల్లో మినహాయింపులు కూడా ఇస్తాము. అందుకోసం కార్యాచరణ రూపొందిస్తాము" అని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ తెలిపారు.
లిథువేనియాలో జరుగుతున్న రెండు రోజుల సమావేశంలో మంగళవారం.. స్వీడన్ చేరికకు ఒప్పందం కుదిరింది. ఇన్ని రోజులు తుర్కియే, హంగరీలు స్వీడన్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించాయి. తాజాగా ఆ దేశాలు మనసు మార్చుకోవడం వల్ల స్వీడన్‌కు అడ్డంకి తొలగినట్లయ్యింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం జరిగిన అనంతరం ఆయా దేశాల అధ్యక్షులు స్వీడన్ చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎఫ్-16 విమానాల అందజేత, ఐరోపా సమాజంలో తుర్కియేకు సభ్యత్వంపై జో బైడెన్ నుంచి మద్దతు లభించింది. ఇక ఉక్రెయిన్ చేరికకు కూడా కూటమి అంగీకరించినప్పటికీ.. ఇంకా ఎప్పుడనేది తేల్చలేదు. సభ్యత్వం ఇవ్వడానికి మాత్రం రోడ్‌మ్యాప్ తయారు చేస్తామని నాటో పేర్కొంది. అయితే దానికి ఎలాంటి కాల పరిమితి నిర్ణయించకపోవడం గమనార్హం.