Sweden Finland NATO: నాటోలో చేరేందుకు నార్డిక్ దేశాలు ఫిన్లాండ్, స్వీడన్ మరో ముందడుగు వేశాయి. రెండు దేశాలు నాటో దరఖాస్తు పత్రంపై సంతకాలు చేశాయి. దీన్ని బ్రస్సెల్స్‌లోని నాటో ప్రధాన కార్యాలయంలో బుధవారమే అందజేయనున్నాయి. టర్కీ అభ్యంతరం చెబుతున్నప్పటికీ ఈ రెండు దేశాలు అధికారిక ప్రక్రియతో ముందుకు సాగుతున్నాయి. రష్యా ఉక్రెయిన్‌పై దండయాత్ర చేయడం వల్ల భయంతోనే ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరేందుకు తహతహలాడుతున్నాయని టర్కీ అధ్యక్షుడు రికెప్ తయ్యిప్ ఎర్డగాన్ ఇటీవల ఆరోపించారు. సోమవారం మరోమారు ఇదే విధంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఫిన్లాండ్, స్వీడన్ నాటాలో చేరకుండా టర్కీ అడ్డుపడుతుందా? అనే విషయం ఆసక్తికరంగా మారింది.
Turkey President: ఏదైనా కొత్త దేశం నాటోలో చేరాలంటే అందులోని 30 సభ్య దేశాల ఆమోదం తప్పనిసరి. ఏ ఒక్క దేశం ఒప్పుకోకపోయినా కొత్త దేశం నాటోలో చేరలేదు. అయితే అమెరికా సహా నాటోలోని చాలా దేశాలు ఫిన్లాండ్, స్వీడన్‌ను స్వాగతిస్తున్నాయి. టర్కీ మాత్రం అభ్యంతరం తెలుపుతోంది. ఈ రెండు దేశాలు కుర్దీస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) మిలిటెంట్లకు ఆశ్రయం కల్పిస్తున్నాయని ఆరోపిస్తోంది.
అయితే ఏప్రిల్‌లో ఎర్డగాన్‌తో మాట్లాడిప్పుడు నాటోలో చేరేందుకు అభ్యంతరం ఏమీ చెప్పలేదని ఫిన్లాండ్ అధ్యక్షుడు సాలి నినిస్టో తెలిపారు. ఆయన ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఏమైనా సమస్యలుంటే చర్చించి పరిష్కరించుకుంటామని అన్నారు. స్వీడన్ ప్రధాని మాగ్డలేనా అండర్సన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టర్కీతో తాము ఇప్పటికీ సంప్రదింపులు జరుపుతున్నామని సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. ఐరోపా సమాఖ్య అధికారులు కూడా ఈ సమస్య పరిష్కృతమవుతుందని భావిస్తున్నారు. ఫిన్లాండ్, స్వీడన్ నాటోలో చేరేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని విశ్వసిస్తున్నారు.