Suriname Gold Mine Accident :దక్షిణ అమెరికా దేశమైన సురినామ్ రాజధాని పరామారిబోలో విషాదకర ఘటన జరిగింది. నగరంలో ఉన్న బంగారు గనిలో అక్రమంగా పసిడిని తవ్వేందుకు వెళ్లి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా గని కూలడం వల్ల వీరంతా చనిపోయారని ఆ దేశ అధ్యక్షుడు చాన్ సాంటోకి వెల్లడించారు.
'ఇక్కడ ఇది సర్వసాధారణమే..'
Gold Mine Collapse : అక్రమంగా బంగారాన్ని తవ్వేందుకు పరామారిబో ప్రాంతానికి చెందిన 10 మంది సోమవారం బంగారు గనికి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు గనిలోని కొంత భాగం కూలిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి రెస్క్యూ సిబ్బందిని పంపించారు. వారు అక్కడకు చేరుకునేలోపే మైనింగ్‌కు వెళ్లినవారంతా మరణించారు. ఇలా అక్రమ బంగారం తవ్వకాలకు వెళ్లడం ఈ ప్రాంతంలో సర్వసాధారణమని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. బంగారం మైనింగ్ కోసం కొందరు.. సొంతంగా సొరంగ మార్గాలను నిర్మించుకున్నారని తెలిపారు.
"గని ఎలా కూలిందో తెలియాల్సి ఉంది. గని వద్ద ఇంకా గందరగోళ వాతావరణం నెలకొని ఉంది. ముందుగా పరిస్థితిని అదుపులోకి తేవడం మా ప్రధాన కర్తవ్యం."
-చాన్ సాంటోకి, సురినామ్ అధ్యక్షుడు
శిథిలాల కింద మరికొంతమంది!
ఘటన జరిగిన సమయంలో సాంటోకి.. ఆ దేశానికి సంబంధించి ఆర్థిక బడ్జెట్ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గనిలో ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన భేటీని మధ్యలోనే నిలిపివేసుకున్నారు. ఇక వెంటనే సహాయక చర్యలకు ఆదేశించారు అధ్యక్షుడు. గనిలోపల శిథిలాల కింద మరికొంత మంది కూలీలు చిక్కుకున్నారని.. వారి జాడ పసిగట్టేందుకు ముమ్మరంగా కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం శూన్యం!
సురినామ్ బంగారు గనులకు ప్రసిద్ధి. ఈ గోల్డ్ మైన్స్‌లో అమెరికా, కెనడాకు చెందిన అనేక కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. అయితే ఇటీవల కాలంలో అనధికారికంగా కూడా బంగారు గనులను కొందరు అక్రమార్కులు తవ్వుతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. అయితే అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు అధికార యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. ప్రస్తుతం ఈ అంశం అక్కడి ప్రభుత్వానికి పెను సవాల్‌గా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఎర్ర సముద్రంలో నౌక హైజాక్ వీడియో రిలీజ్- నేరుగా హౌతీలతో మాట్లాడుతున్న జపాన్
భారత్‌కు వస్తున్న ఇజ్రాయెల్ నౌక హైజాక్- హౌతీ రెబల్స్ పనే- గాజాపై దాడులు ఆపాలని హెచ్చరిక