అరుణాచల్‌ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా.. చైనాను తప్పుబట్టింది. వాస్తవాధీన రేఖ వెంబడి నిరంతరాయంగా బలగాలను మోహరిస్తూ చైనా నిర్మాణాలు చేపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అమెరికాలోని రక్షణశాఖ కేంద్రం పెంటగాన్ ఓ ప్రకటన జారీ చేసింది. ఇండో-పసిఫిక్‌లోని అమెరికా మిత్రులు, భాగస్వాములను చైనా కవ్విస్తున్న వైఖరికి ఇది అద్దంపడుతోందని మండిపడింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ తీసుకొన్న చర్యలకు పూర్తి మద్దతును ప్రకటించింది.
తవాంగ్ ఘర్షణపై చైనాకు అమెరికా షాక్.. భారత్‌కు పూర్తి మద్దతు
అరుణాచల్‌ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లో జరిగిన ఘర్షణకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా.. చైనాను తప్పుబట్టింది. ఉద్రిక్తతలు తగ్గించడం కోసం భారత్ తీసుకొన్న చర్యలకు పూర్తి మద్దతును ప్రకటించింది.
మరోవైపు, అమెరికా విదేశాంగ శాఖ కూడా ఘర్షణపై స్పందించింది. భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నట్లు చెప్పింది. ఈ ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి ఇరుపక్షాలు వెంటనే చర్యలు చేపట్టడం సంతోషకరమని వ్యాఖ్యానించింది. ఎల్ఏసీ వెంట ఏకపక్షంగా యథాతథ పరిస్థితిని మార్చేందుకు యత్నించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక మార్గాలను వినియోగించుకుని విభేదాలపై చర్చించుకొనేలా భారత్-చైనాను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.