Britain Pm Race : కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకునేందుకు బ్రిటన్‌లో అధికార కన్జర్వేటివ్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతోన్న వేళ.. అక్కడి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునాక్ పేరు మరోసారి బలంగా వినిపిస్తోంది. ఆయనకు 100 మంది ఎంపీలు మద్దతిస్తున్నట్లు సునాక్ మద్దతుదారులు తాజాగా వెల్లడించారు.
కొత్త నిబంధనల ప్రకారం.. కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికీ, తద్వారా ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అభ్యర్థులకు కనీసం 100 మంది పార్టీ ఎంపీల మద్దతు ఉండాలి. ఈ క్రమంలోనే సునాక్‌కు వంద మంది ఎంపీలు మద్దతిస్తున్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. ఆయన పోటీ చేయనున్నట్లు తెలిపారు. అయితే, దీనిపై సునాక్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
హుటాహుటిన యూకేకు బోరిస్..
ఇదిలా ఉండగా.. ప్రధాని పదవికి పోటీ చేసేందుకు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన భార్యాపిల్లలతో ప్రస్తుతం విహారయాత్రలో ఉన్న జాన్సన్.. హుటాహుటిన యూకే చేరుకున్నారు. కన్జర్వేటివ్ ఎంపీల మద్దతు కూడగట్టుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 45 మంది ఎంపీలు జాన్సన్‌కు మద్దతుగా ఉండగా.. సోమవారానికి ఈ సంఖ్య 100కు చేరే అవకాశమున్నట్లు తెలుస్తోంది.